ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్‌ కు మరో షాక్!

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయిలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలకు ముందు జరగాల్సిన కెప్టెన్ల సమావేశం అనూహ్యంగా రద్దు అయ్యింది. కొన్ని జట్లు ఆలస్యంగా పాకిస్థాన్‌ చేరుకోవడం, షెడ్యూల్‌లో మార్పులు రావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు నిర్దేశిత సమయానికి పాకిస్థాన్ చేరుకోలేకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 18న ఇంగ్లండ్ జట్టు లాహోర్‌కు చేరుకోనుండగా, మరుసటి రోజు ఆస్ట్రేలియా వెళ్తుంది. దీంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్ల సమావేశం నిర్వహించేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లను దుబాయిలోనే ఆడనుంది. గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఫిబ్రవరి 23న హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఐసీసీ, PCB సంయుక్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీని ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 7న పునర్నిర్మించిన గడ్డాఫీ స్టేడియాన్ని, ఫిబ్రవరి 11న కరాచీ నేషనల్ స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే, ఈ ఓపెనింగ్ సెర్మనీకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకావాలా? వద్దా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

ఐసీసీ, PCB దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోయినా, బీసీసీఐ మాత్రం రోహిత్‌ను పాకిస్థాన్‌కు పంపేందుకు సుముఖంగా లేదని ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి హై ఓల్టేజ్ టోర్నమెంట్‌గా మారనుంది. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో వేదికపై కూడా ఆసక్తి నెలకొంది. భారత జట్టు పూర్తి దూరంగా ఉండకపోయినా, పాక్‌లో మ్యాచ్‌లు ఆడకపోవడం ఒక విధంగా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా మారబోతోంది.

షర్మిల నాటకం|| Sr Journalist Lalith Kumar About Ys Sharmila Comments On Chandrababu Davos Tour || TR