Pakistan: ఆదాయం పెరిగినా ఆకలి తీరడం లేదు.. పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఇప్పుడు రోజువారీ జీవనం.. పెద్ద సవాలుగా మారింది. చేతికి వచ్చే ఆదాయం సరిపోవడం కాదు, కనీస అవసరాలు కూడా భారంగా మారుతున్నాయి. తాజా ప్రభుత్వ సర్వే ప్రకారం.. అక్కడి కుటుంబాల ఆదాయంలో మూడింట రెండు వంతులు కేవలం ఆహారం, విద్యుత్, గ్యాస్ వంటి మౌలిక అవసరాలకే ఖర్చవుతోంది. దీంతో భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టే అవకాశమే లేకుండా ప్రజలు జీవిస్తున్నారు.

హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే 2024–25 వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలు, విద్యుత్ చార్జీల భారంతో పాక్ ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆదాయం పెరిగిందనే భావన ఉన్నప్పటికీ, ఆ ఆదాయాన్ని మించిన వేగంతో ఖర్చులు పెరగడంతో కొనుగోలు శక్తి తీవ్రంగా క్షీణిస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ కుటుంబాలు తమ ఆదాయంలో సగటున 37 శాతం కేవలం ఆహారానికి, మరో 26 శాతం విద్యుత్, గ్యాస్ బిల్లులకు చెల్లించాల్సి వస్తోంది. అంటే మొత్తం ఆదాయంలో 63 శాతం రెండు అవసరాలకే ఖర్చవుతోంది. ఇక విద్యపై ఖర్చు చేస్తున్న మొత్తం కేవలం 2.5 శాతానికి పరిమితమైంది. ఆరోగ్యం, వినోదం, ఇతర మౌలిక అవసరాలన్నింటిని కలిపినా ఖర్చు 7 శాతం దాటడం లేదు.

ఇది పాకిస్తాన్‌లో మానవాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబాల ఆరోగ్యం, దీర్ఘకాలిక భద్రత అన్నీ వెనుకబడిపోతున్నాయి. జీవించేందుకు ఖర్చు పెరిగిపోవడంతో ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించే స్థితిలో కూడా లేరని సర్వే స్పష్టం చేసింది. గత ఆరు సంవత్సరాల్లో పాకిస్తాన్‌లో నెలవారీ సగటు జీతాలు 41,500 పాక్ రూపాయల నుంచి 82,000 వరకు పెరిగినప్పటికీ, అదే సమయంలో జీవన ఖర్చులు ఏకంగా 19 శాతం పెరిగాయి. జీతాల పెరుగుదల ప్రజలకు ఊరటనివ్వాల్సిన బదులు, పెరిగిన ఖర్చుల ముందు అది నిస్సారంగా మారింది. దీంతో సాధారణ పౌరుల జీవితం మరింత కష్టంగా మారుతోంది.

ఇవన్నీ చాలనట్లు ఆదాయ అసమానతలు కూడా తీవ్రంగా పెరిగాయి. ధనవంతులు అత్యంత పేదల కంటే మూడు రెట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారని సర్వే వెల్లడించింది. ఈ పరిస్థితి పాకిస్తాన్ సమాజంలో విభేదాలను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.