Diabetes: డయాబెటిస్ ఉన్నవారు గుడ్లు తినొచ్చా.. వైద్యులు ఏమంటున్నారంటే..?

ఈ రోజుల్లో అనేక మందిని వేధిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. దీర్ఘకాలిక నొప్పితో పాటు శరీరంలో పలు సమస్యలను తెచ్చే ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేకపోవడంతో, ఆహారపు అలవాట్ల మార్పు ద్వారానే దీన్ని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా ఒక సాధారణ ఆహార పదార్థం.. గుడ్డు డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

కోడిగుడ్డుని సూపర్ ఫుడ్ గా పరిగణించడానికి కారణం దీని పోషక విలువలు మాత్రమే కాక, దాన్ని సులభంగా వండుకోవచ్చనే సౌలభ్యం కూడా. గుడ్లు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటంతో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో ఉండటమే డయాబెటిస్ బాధితులకు శుభవార్త.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి నాలుగు గుడ్లు తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. గుడ్లలో ఉండే ప్రోటీన్ శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా వాపు స్థాయిలను తగ్గించి, జీవక్రియను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే నాలుగు గుడ్లకంటే ఎక్కువ తినడం అదనపు ప్రయోజనం ఇవ్వదని వారు హెచ్చరిస్తున్నారు.

గుడ్లు ప్రత్యేకంగా ఉదయం అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి శక్తినిస్తాయి. అలాగే, పగటిపూట రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. గుడ్లలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ హృదయానికి మేలు చేయడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆహార నిపుణులు చెబుతున్నట్లు, గుడ్లను ఉడికించి తినడం అత్యంత ఆరోగ్యకరం. ఫ్రై చేసిన గుడ్ల కంటే ఉడకబెట్టిన గుడ్లు రక్తంలో చక్కెర నియంత్రణలో మెరుగైన ఫలితాలు ఇస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు గుడ్లు తినడమే కాకుండా వ్యాయామం, సరైన నిద్ర, వైద్యుల పర్యవేక్షణలో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, సరైన ఆహారపు అలవాట్లతో దాన్ని నియంత్రించడం సాధ్యమే. వారానికి నాలుగు గుడ్లు తినడం ఉత్తమమని చెబుతున్నారు.