శీతాకాలం వచ్చిందంటే చలి మాత్రమే కాదు.. చాలా మందికి ఉదయాన్నే మొదలయ్యే కీళ్ల నొప్పులు కూడా మొదలవుతాయి. మంచం మీద నుంచి లేవగానే మోకాళ్లు, నడుము, భుజాల్లో దృఢత్వం.. కొద్దిసేపు కదిలితే కానీ నడవలేని పరిస్థితి మొదలవుతుంది. బయటకు వెళ్లాలంటే చలి భయంతో శారీరక శ్రమ తగ్గిపోతుంది. అదే సమయంలో ఈ చిన్నగా మొదలైన నొప్పి క్రమంగా రోజువారీ పనులకే ఆటంకం కలిగించే స్థాయికి చేరుతుంది. చాలామంది దీనిని వయస్సు వల్లే అని పక్కన పెడతారు. కానీ నిజానికి శీతాకాలపు కీళ్ల నొప్పులు వృద్ధుల సమస్య మాత్రమే కాదు.. యువత, ఉద్యోగులు, ఇంట్లో ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చునేవారిని కూడా ఈ సమస్యలు వేదిస్తుంటాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరంలోని కండరాలు, కీళ్ళు సహజంగా దృఢంగా మారతాయి. దీంతో కదలికలు తగ్గి నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాదు చలివాతావరణంలో రక్తప్రసరణ కూడా నెమ్మదిస్తుంది. కీళ్లకు అవసరమైన వేడి, పోషకాలు సరిగా చేరకపోవడంతో నొప్పి మరింత పెరుగుతుంది. పైగా బయటకు వెళ్లి నడవడం, వ్యాయామం చేయడం తగ్గిపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇప్పటికే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఈ నొప్పులు మరింత తీవ్రమవుతాయి.
రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగులు, శారీరక చురుకుదనం లేని వారు కూడా శీతాకాలంలో కీళ్ల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మహిళల్లో హార్మోన్ల మార్పులు, కాల్షియం, విటమిన్ డి లోపం ఈ నొప్పిని మరింత పెంచుతాయి. మొదట్లో చిన్న అసౌకర్యంలా కనిపించినా, పట్టించుకోకుండా వదిలేస్తే అదే నొప్పి క్రమంగా నడక, పని, నిద్ర మీద కూడా ప్రభావం చూపించే స్థాయికి చేరుతుంది.
అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. చలికాలంలో శరీరాన్ని, ముఖ్యంగా కీళ్లను వెచ్చగా కప్పి ఉంచడం చాలా ముఖ్యం. రోజూ తప్పనిసరిగా తేలికపాటి వ్యాయామం లేదా స్ట్రెచింగ్ చేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కీళ్ల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కదలాలి. కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. నొప్పి ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. చలిని తేలికగా తీసుకుంటే కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. ఈ శీతాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే.. నొప్పి కాదు, ఆరోగ్యమే మీతో పాటు నడుస్తుంది.
