ఈ మధ్య కాలంలో మహిళల్లో అబార్షన్ చేయించుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కొంతమంది స్త్రీలకు ప్రతిసారీ అబార్షన్ జరుగుతుండటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ప్రతి మహిళకు మాతృత్వం అనేది వరం అనే సంగతి తెలిసిందే. తల్లి కావాలని మహిళలు కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి.
ప్రతిసారి మహిళల్లో అబార్షన్ జరుగుతుందంటే అందుకు సంబంధించి కొన్ని కారణాలు ఉంటాయి. అబార్షన్ కావడానికి మెజారిటీ సందర్భాల్లో క్రోమోజోమ్ సమస్యలు, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇమ్యునోలాజికల్ సమస్యలు, సెప్టేట్ గర్భాశయం, హార్మోన్ అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తరహా సమస్యలు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి.
పురుష భాగస్వామి స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండటం లేదా స్త్రీ గుడ్డు నాణ్యమైనది కాకపోవడం వల్ల కూడా అబార్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. మూలకారణాన్ని అర్థం చేసుకుని వైద్యుల సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అబార్షన్ జరగకుండా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా సమస్యలకు అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సులువుగానే మంచి చికిత్స లభిస్తుంది.
ఈ సమస్య చిన్నదిగా అనిపించినా పిల్లలు లేని తల్లీదండ్రులు అనుభవించే క్షోభ అంతాఇంతా కాదు. ఒకసారి అబార్షన్ అయిన తర్వాత వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.