ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం మన సంప్రదాయం. అలా కొట్టిన కొబ్బరికాయను చాలామంది ఇంటికి తెచ్చుకుంటారు. కొందరు దాన్ని పచ్చిగానే తింటారు.. మరికొందరు చట్నీగా, కూరల్లో కలిపి ఆస్వాదిస్తారు. అయితే షుగర్ ఉందంటే కొబ్బరి తినకూడదు అనే మాట వినగానే చాలామంది సందేహంలో పడిపోతారు. నిజంగా డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి కొబ్బరి హానికరమేనా? లేక ఇది కేవలం అపోహేనా? అన్న ప్రశ్నకు నిపుణులు ఇచ్చే సమాధానం చాలామందికి ఊరట కలిగించేలా ఉంది.
డయాబెటిస్ అంటే చక్కెర పూర్తిగా మానేయాలి అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ ఆహారం మొత్తాన్ని కాదు.. దాని మోతాదు, కలయిక ముఖ్యం అంటున్నారు డాక్టర్లు, డైటిషియన్లు. పచ్చి కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న కొద్దిపాటి కార్బ్స్ కూడా ఎక్కువగా ఫైబర్ రూపంలోనే ఉంటాయి. ఈ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. దాంతో భోజనం చేసిన వెంటనే రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పచ్చి కొబ్బరి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారం. అంటే ఇది తిన్నా షుగర్ లెవల్స్‌పై ఒక్కసారిగా దాడి చేసేలా ప్రభావం చూపదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి అస్సలు తినకూడదు అన్నది పూర్తిగా నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన పరిమాణంలో తీసుకుంటే ఇది పెద్ద సమస్యగా మారదని స్పష్టం చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తప్పనిసరి. పచ్చి కొబ్బరిలో కేలరీలు, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. మితిమీరితే బరువు పెరగడం, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ మితంగా తింటే అదే కొబ్బరి లాభంగా మారుతుంది. ఇందులోని ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన ఇస్తుంది. దాంతో తరచూ ఆకలి వేయడం తగ్గి.. అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. ఇది ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయుక్తం.
కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ఫ్యాట్స్ శరీరంలో కొవ్వుగా నిల్వ కాకుండా త్వరగా ఎనర్జీగా మారతాయి. అలాగే ఐరన్ వంటి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలోని కీలక ప్రక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన స్వీట్లకు బదులుగా పచ్చి కొబ్బరిని పరిమితంగా తీసుకోవడం కొంతవరకు హెల్తీ ఎంపికగా చెప్పవచ్చు.
నిపుణుల సూచన ప్రకారం షుగర్ పేషెంట్లు రోజుకు సుమారు 30 నుంచి 40 గ్రాములు… అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. కూరల్లో, సలాడ్స్‌లో లేదా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలతో కలిపి తింటే మరింత మంచిది. మార్కెట్‌లో దొరికే షుగర్ కలిపిన కొబ్బరి స్వీట్లు, డిజర్ట్స్ మాత్రం తప్పనిసరిగా దూరంగా పెట్టాలి. కొత్తగా కొబ్బరి తినడం మొదలుపెట్టినప్పుడు షుగర్ లెవల్స్‌ను గమనించడం కూడా అవసరం. మొత్తానికి… గుడి కొబ్బరి భయపడాల్సిన శత్రువు కాదు.. మోతాదే దాని అసలైన రహస్యం.
