సాధారణంగా పండగలు, పెళ్లి, వేడుకలు, పార్టీల సమయంలో ముందుగా పిండి వంటల వాసనలు, మిఠాయిల తీపి రుచులు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ఆనందాల మధ్య మన గుండె ఆరోగ్యాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే గుండె మన బాడీలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది సరిగా పనిచేయకపోతే మన జీవితం మొత్తం కుదేలవుతుంది. కాబట్టి పండుగల్లోనూ మనం తినే ఆహారం మీద కొంత జాగ్రత్త తీసుకోవాలి.
సాధారణంగా పండగలు లేదా పెళ్లి, పార్టీల సమయంలో టైమ్‌లో పిండి పదార్థాలు, నెయ్యి, నూనెలతో చేసిన వంటలు, బెల్లం-పంచదారతో చేసిన స్వీట్స్ తప్పనిసరిగా వడ్డిస్తారు. కానీ ఇవి రుచిగా ఉన్నా, గుండెకు మాత్రం భారమే. చక్కెర, ఫ్రైడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. చివరికి ఇవి గుండె సమస్యలకు దారితీస్తాయి. అయితే పండుగలలో హెల్త్‌ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా ప్లాన్ చేస్తే రుచులు ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
బూరెలు, గారెలు, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఒక్కటి రెండు తిన్నా సరిపోతుంది. స్వీట్స్ పరిమితంగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఎక్కువ మిఠాయిలు తింటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మిల్లెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ లాంటి హెల్దీ ఆప్షన్స్‌ను తీసుకోవాలి. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. నట్స్ (బాదం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు) రోజూ 15–20 వరకు తీసుకుంటే గుండెకు బాగా మేలు చేస్తాయి. వీటిలో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి.
అత్తిపండ్లు, అవిసెలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడిగింజలు.. ఇవన్నీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండివుంటాయి. ఇవి గుండె సమస్యల్ని దూరం చేస్తాయి. రెండు నానబెట్టిన అత్తిపండ్లు రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయులు కంట్రోల్ అవుతాయి. ఇక రోజుకు ఒక బౌల్ కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కూరగాయలు తప్పనిసరిగా తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్‌లు పుష్కలంగా ఉండి గుండెను రక్షిస్తాయి. మొలకలు, పప్పుదినుసులు, కాల్చిన శనగలు లాంటి ప్లాంట్ ప్రోటీన్ కూడా మేలే.
అంతేకాదు వెల్లుల్లి తరచూ ఆహారంలో చేర్చండి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఉసిరి నీరు తాగితే విటమిన్ C లభిస్తుంది. పసుపు నీరు శోథ నిరోధకంగా పనిచేస్తుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాకుండా పండుగల్లో యాక్టివ్‌గా ఉండాలి. ఉదయపు నడక, యోగా, తేలికపాటి వ్యాయామం గుండెకు ప్రాణం పోస్తాయి. నీటిని ఎక్కువగా తాగాలి. పండుగల, వేడుకల సమయంలో రుచులు తప్పనిసరిగా ఆస్వాదించాలి. కానీ పరిమితిలో. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూనే హెల్దీ ఫుడ్స్‌ను చేర్చుకుంటే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలతో రుచులు, ఆరోగ్యం రెండూ మీవే.
