ఈ మధ్య కాలంలో చాలామంది విచిత్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. శరీరమంతా చురుకుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సూదులతో గుచ్చినట్టు అనిపించడం, మొద్దుబారడం, తిమ్మిర్లు, మంటలు లాంటి సమస్యలు ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్నాయి. ఈ లక్షణాలు వేర్వేరు ఆరోగ్య సమస్యలకు సంకేతాలు అని చెప్పవచ్చు.
చిన్న నాడులు దెబ్బతింటే సూదులతో గుచ్చినట్టు, మొద్దుబారినట్టు, మంటలు పుట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. పెద్ద నాడులు దెబ్బతింటే అడుగులు తడబడడం, నడక బ్యాలెన్స్ తప్పడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. మితిమీరిన మద్యపానం, కొన్ని రకాల యాంటీ బయోటిక్స్, విటమిన్ బీ12 బీ5 లోపం, కాళ్లలో తిమ్మిర్లు, మంటలకు మూల కారణం వెన్నులో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.
హైపో థైరాయిడ్‌లో కాళ్ల కండరాలు బలహీనపడి పెరిఫెరల్ న్యూరోపతీ వస్తుంది. రక్త హీనత సమస్యతో బాధ పడేవాళ్లలో సైతం ఈ లక్షణాలు కనిపిస్తాయి. నరాల పైపొర మైలీన్ షీట్ ఊడిపోయినా పై లక్షణాలతో పాటు కాళ్ల బలహీనత కూడా వేధిస్తుంది. శరీరంలో రహస్యంగా దాగిన కేన్సర్లు న్యూరోపతీ లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటాయి. న్యూరోపతీకి ఇతరత్రా కారణాలు కనిపించనప్పుడు వైద్యులు ఇమ్యునో ఎలకో్ట్రఫొరెసిస్ అనే రక్తపరీక్ష చేయించి, ‘పారాప్రొటీనిమియా’ పరిస్థితిని కనిపెట్టడం ద్వారా శరీరంలో దాగిన కేన్సర్లను కనిపెడతారు.
క్రమం తప్పక వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. . పాదాల్లో చిన్న చీలిక ఏర్పడినా, అది పుండుగా మారి చికిత్సకు లొంగని పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి ఫుట్ కేర్ తీసుకోవాలి. థయామిన్ (విటమిన్ బి1) లోపంతో, పాంటోథెనిక్ యాసిడ్ (విటమిన్ బి5) లోపంతో అరికాళ్ల మంటలు (బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్) లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
