ప్రస్తుత రోజుల్లో గుండెపోటు పెద్ద వయసువారికి మాత్రమే పరిమితం కావట్లేదు.. 25–30 ఏళ్ల యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ నిపుణులు చెబుతున్న ఒక చిన్న అలవాటు ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలదని చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, మొబైల్‌లో మునిగిపోవడం, లేదా పడుకోవడం కాకుండా కేవలం 15 నిమిషాల పాటు నడక చేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మనం తినే ప్రతి ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్‌ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది. అయితే భోజనం తర్వాత నడక అలవాటు చేసుకుంటే, కండరాలు గ్లూకోజ్‌ను వెంటనే ఉపయోగించుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది.
ఇంకా ఒక ప్రయోజనం ఏమిటంటే, నడక వల్ల రక్త ప్రసరణ సజావుగా కొనసాగుతుంది. శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా వెంటనే శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటమే కాకుండా బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. ముఖ్యంగా ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు ఉన్నవారు భోజనం తర్వాత నడకను అలవాటు చేసుకుంటే గుండెపోటు ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అమెరికాలో ఇటీవల జరిగిన ఒక వైద్య పరిశోధనలో, రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత 15 నిమిషాలు నడిచే వ్యక్తుల్లో గుండె సంబంధిత వ్యాధులు 40 శాతం వరకు తగ్గాయని తేలింది. జిమ్‌కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారి కోసం ఇది అత్యంత సులభమైన ఆరోగ్య రహస్యం అని నిపుణులు చెబుతున్నారు. చిన్న అలవాటు, పెద్ద ఫలితం. ప్రతిరోజూ భోజనం తర్వాత 15 నిమిషాలు నడకతో గుండెపోటు వంటి పెద్ద ప్రమాదాల నుంచి రక్షించగలదు.
