కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తోందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ పదే పదే చేస్తున్న విమర్శలకు భైంసా సభలో రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. భైంసా సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత మల్లు బట్టి విక్రమార్క మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్ మూడు నిమిషాలే మాట్లాడారు. సభలో రేవంత్ ఏమన్నారో చదవండి.
ఆదిలాబాద్ జిల్లా అంటే అపారమైన అటవీ సంపద ఉన్న జిల్లా.. చురుకైన, చైతన్యవంతమైన లంబాడీ సోదరులు నివసించే జిల్లా.. భూమి మీద పుట్టిన ప్రతి వాడికి చదువులు నేర్పిస్తున్న బాసర సరస్వతి అమ్మవారు నివశిస్తున్న జిల్లా..
2004లో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఈ ఆదిలాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 8 స్థానాలు గెలిపించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం అటువంటిది.
సోయి లేని చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని అంటున్నడు. 80 వేల పుస్తకాలు చదివిన కేసిఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నెహ్రూ ఫ్యామిలీ చరిత్ర చదివినట్లు లేదు. నెహ్రూ బతికున్నంత కాలం ఇందిరమ్మ మంత్రి కాలేదు. నెహ్రూ మరణించిన తర్వాతనే ఇందిరా గాంధీ కేంద్ర మంత్రి అయ్యిర్రు.
ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నంత కాలం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాలేదు. ముష్కరుల తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ బలైన తర్వాత రాజీవ్ గాంధీ దేశ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా దేశానికి సేవలందించారు.
రాజీవ్ గాంధీ హయాంలో ఏనాడూ సోనియాగాంధీ రాజకీయాల్లోకి రాలేదు. రాజీవ్ గాంధీ దేశం కోసం తన ప్రాణాలు బలి ఇచ్చిన 7 సంవత్సరాల తర్వాత తల్లి సోనియా ఈ దేశానికి నాయకత్వం వహించడానికి ముందుకొచ్చారు.
సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలుగా అయిన తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసింది తప్ప ఆమె కాలేదు. ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆ కుటుంబానికి ఉన్నది.
నేడు ఈ దేశానికి నాయకత్వం అవసరం ఉన్నది. రాహుల్ గాంధీకి అండగా ఉండి ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉన్నది. రాహుల్ గాంధీకి అండగా ఉందామా? ఈ దేశానికి ప్రధానిని చేద్దామా?
రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ టిఆర్ఎస్ ను ఓడించాలి. కాంగ్రెస్ ను గెలిపించాలి. ఈ ఎన్నికల్లో కేసిఆర్ ను ఓడించడానికి మీదగ్గర ఏమున్నది అని ఒక పాత్రికేయ మిత్రుడు నన్ను అడిగిండు. కేసిఆర్ దగ్గర అంగ బలం, అర్ధ బలం ఉన్నది మరి కేసిఆర్ ను ఎట్లా ఓడిస్తారని అడిగిండు.
కాంగ్రెస్ కార్యకర్తలకు పట్టుదల ఉంది, సోనియమ్మ ఆశీర్వాదం ఉన్నది. అవి చాలు మేము గెలవడానికి. చివరి వరకు పోరాటం చేస్తేనే ఓటమి కూడా గెలుపు గా మారుతుంది. మనందరం చివరి వరకు పోరాటం చేద్దామా? సోనియమ్మ ఆశీర్వాదం తో పని చేద్దామా?
ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల బతుకులు బాగుపడాలంటే మనమందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. కేసిఆర్ మీద పోరాటం చేయాలి.
జై సోనియమ్మ
జై రాహుల్ గాంధీ గారు.