ఒకప్పుడు సూపర్ మార్కెట్లకే పరిమితమైన కివి పండ్లు ప్రస్తుత రోజుల్లో అన్ని రకాల మార్కెట్లలో సమృద్ధిగా లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కివి పండు ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి కొంత ఖరీదు అయినప్పటికీ వీటిని తినటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ప్రతిరోజు కివి పండును మన డైట్ లో చేర్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కివి పండ్లను తరచూ ఆహారంలో తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కివి పండు ఆరోగ్య ప్రయోజనాల గురించి మరోసారి తెలుసుకుందాం.
మనం తరచూ అనారోగ్యానికి గురికావడానికి మొదటి కారణం మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. కావున విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, పోలీక్ ఆమ్లం సమృద్ధిగా లభించే కివి పండు ను ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధ శక్తి పెంపొందుతుంది. ఓ అధ్యయనం ప్రకారం 100 గ్రాముల కివి పండులో రోజువారి మన జీవ క్రియలకు అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే మూడు గ్రాముల ఫైబర్ కూడా లభిస్తుంది. కివి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడడంలో సహాయపడతాయి.
కివి పండులో సమృద్ధిగా ఉన్న పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థ లోపాలను తొలగించి రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. మరియు టైప్ 1, టైప్2 డయాబెటిస్, పక్షవాతం, ఉబకాయం సమస్యలతో బాధపడేవారు తరచూ కివి ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివి పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్ ఎక్కువగా ఉండడంవల్ల ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్‌గా రూపాంతరం చెంది జీర్ణశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మలబద్ధకం, ఫైల్స్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
కివి పండు మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి లో సహాయపడి మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కివి పండులో ఉండే విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి మూలకాలు ఎముకలను దృఢంగా ఉంచి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యను అరికడతాయి.