నూనె గింజల్లో ఒకటైన నువ్వులు రోజువారి ఆహారంలో ఉపయోగిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. నువ్వుల నూనెలో అత్యధికంగా లభ్యమయ్యే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు జుట్టు సహజ గుణాన్ని, ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుందని బ్యూటిషన్ నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెను జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా అనేక రకాల జుట్టు సమస్యలు తలెత్తే శీతాకాలం లాంటి సీజన్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ , ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న నువ్వుల నూనెను తలపై మర్దన చేసుకుంటే చుండ్రు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తలలో పుండ్లు వంటి సమస్యలు తొలగిపోయి జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది అలాగే నువ్వుల నూనెలో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ప్యాడి కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి పనిచేస్తాయి. రోజూ నువ్వుల నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు నువ్వుల నూనెలో కొబ్బరి నూనెను కలిపి తల చర్మానికి, జుట్టు కుదుర్లకు అంటే విధంగా మర్దన చేసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య నుంచి తొందరగా విముక్తి లభిస్తుంది
తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడేవారు నువ్వుల నూనెలో గ్లిజరిన్ మిక్స్ చేసి తలపై మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తగ్గి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెలో అలోవెరా జెల్ లేదా నిమ్మకాయ రసం కలిపి రాత్రి పడుకునే ముందు తలపై మర్దన చేసుకుని ఉదయం గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే అందమైన , మృదువైన కురులు మీ సొంతమైనట్లే..