రాత్రిపూట నిద్రకు వెళ్లే ముందు రెండు గంటలలోపే డిన్నర్ పూర్తి చేసేయాలి అనేది ఆరోగ్య సూత్రం. కానీ.. రాత్రిపూట లేట్ నైట్లో స్నాక్స్ తినేవారు కొందరుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదా? అంటే ఖచ్చితంగా కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా.. మరునాడు ఆఫీసులో చేసే పనిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీనిపై నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనను జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
నిద్ర, వ్యాయామం, ఆహారం.. మనం చేసే పనిపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. అయితే.. ఇలా అనారోగ్యకరమైన, వేళకాని వేళ తీసుకునే ఆహారం వల్ల అప్పటికప్పుడే కాకపోయినా దీర్ఘకాల సమస్యలు వస్తాయని తేల్చారు. ఈ అధ్యయనంలో సైంటిస్టులు రెండు ప్రధాన ప్రశ్నలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆ తర్వాత రోజే ప్రభావం చూపిస్తుందా? ఒకవేళ చేస్తే ఎందుకు? అని రెండు ప్రశ్నలపై అమెరికాకి చెందిన 97 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులపై ఈ ప్రశ్నలు వేశారు.
వీరందరినీ పది రోజుల.. ప్రతి రోజు మూడు సార్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. రోజు ఉదయాన్నే చేసే పనులు, ముందు రోజు చేసిన పనులపై.. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఆరా తీసేవారు. మళ్లీ.. సాయంత్రం ఆరోజు ఆఫీస్ లో ఎలాంటి పనులు చేశారు.. ఎలా ఉన్నారు.. ఎన్ని పనులు చేశారు.. అన్నింట్లో సక్సెస్ అయ్యారా.. లేదా? అనే విషయాలపై ప్రశ్నలు సంధించారు. మళ్లీ రాత్రి నిద్రపోయే ముందు ఆరోజు వారు ఏం తిన్నారు.. ఏం తాగారు అనే విషయాలను అడిగేవారు. దీని ద్వారా సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు.
ఈ సర్వే ద్వారా.. మిడ్ నైట్ స్నాక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చారు. ముందురోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మరుసటి రోజు పనిలో ఆసక్తి తగ్గిందని తేల్చారు. చేసే పనిలో మందకొడితనం, ఇతరులకు సాయం చేయకపోవడం, ముఖ్యమైన పనులపై అలసత్వం చూపినట్టు తేలింది. ఇందుకే మరునాడు యాక్టివ్ గా ఉండాలంటే రాత్రి సమయంలో త్వరగా తినడం.. లేట్ ఫుడ్ వైపు వెళ్లకపోవడమే మంచిదని తేల్చారు.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఆహార నిపుణులు, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. నిపుణుల అభిప్రాయాలకు పై కథనం ప్రత్యామ్నాయం కాదు. గమనించగలరు.