చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…..ముఖ్యంగా చలికాలంలో!

ఈ చలికాలంలో రోజురోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగి భరించడం కష్టంగా మారుతోంది. మరి పసిపిల్లల పరిస్థితి ఏంటో మనం ఊహించగలమా. చలి తీవ్రత నుంచి పసిపిల్లల ఆరోగ్యాన్ని రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల కోమలమైన శరీరం అత్యధిక వేడిని చల్లదనాన్ని తట్టుకోలేదు కావున చలి తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గి తరచూ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి. పైగా చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావున తొందరగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పిల్లల శరీరాన్ని చలి తీవ్రత నుంచి రక్షించడానికి శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడానిక నాణ్యమైన కొబ్బరినూనె లేదా బాదం నూనెతో సున్నితంగా బాడీ మొత్తం మసాజ్ చేయాలి దీంతో శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలం లో పసి పిల్లలకు రోజు స్నానం అక్కర్లేదు. ఒకవేళ చేయించాల్సి వస్తుంది గోరువెచ్చని నీళ్లతో తొందరగా స్నానం చేయించి స్నానం తర్వాత టవల్‌తో తుడిచి వెచ్చదనం ఇచ్చే బట్టలు తొడగాలి. రాత్రి సమయాల్లో
చిన్నారి శరీరం మొత్తం కప్పి ఉంచే డ్రెస్ ఎంచుకోవాలి. మెత్తని ఫ్యాబ్రిక్‌తో ఉండేవి వాడాలి. పిల్లలకు చికాకు తెప్పించే బట్టలు వాడొద్దు. తల, చెవులు కూడా మూసి ఉండేలా బట్టలు వాడితే చలి తీవ్రత తగ్గించుకోవచ్చు.

చిన్నపిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి.తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లను వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు.