ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం తినటం ఎంత అవసరమో నీళ్లు తాగటం కూడా అంతే అవసరం. ఒకరోజు ఆహారం లేకపోయినా కూడా మనిషి జీవించగలడు కానీ ఒక్కరోజు నీరు తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నీరు తాగకపోవటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారినపడి ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు తగిన మోతాదులో నీరు తాగటం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే సాధారణంగా చాలామందికి ఎక్కువ దాహం వేస్తుంది అందువల్ల వారు తరచూ నీరు తాగుతూ ఉంటారు. అయితే ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరక మళ్లీ మళ్లీ నీళ్ళు తాగాలనిపిస్తుంది. అయితే ఇలా తరచూ దాహం వేయటం కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు తరచు మూత్ర విసర్జన చేస్తుంటారు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరం దానిని మూత్రం రూపంలో బయటికి పంపుతుంది. అందువల్ల శరీరంలో ఉన్న నీరు మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. అందువల్ల తరచూ దాహం వేస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి షుగర్ వ్యాధి కి సంబందించిన పరీక్షలు చేయించుకోవటం మంచిది.
అంతే కాకుండా గర్భంతో ఉన్న మహిళలకు కూడా ఎక్కువ దాహం వేస్తుంది. ఇది అందరి గర్భిణీలలో ఉండే సమస్య అయినప్పటికీ కొందరిలో షుగర్ వ్యాధి వల్ల కూడా ఇలా దాహం వేస్తుంది. గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు కూడా అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి…లేదంటే తల్లీ బిడ్డా ఇద్దరు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో బయటికి పోతుంది . దీంతో శరీరం డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో తరచూ దాహం వేస్తుంది.
అంతే కాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో కణాలలోకి గ్లూకోజ్ చేరకుండా నిరోధించే సమస్య ఉంటుంది. దీంతో శరీరంలో కీటోన్‌ల సంఖ్య పెరుగుతుంది.ఇది ఆమ్లంగా మారి కీటోయాసిడోసిస్ సమస్యకు దారితీస్తుంది. దీంతో మూత్ర విసర్జన ఎక్కువయ్యి దాహం పెరుగుతుంది. కీటోయాసిడోసిస్ అనేది ప్రాణాంతక సమస్య. శరీరంలో ఈ సమస్య మొదలైనప్పుడు చర్మం పొడి బారటం, శ్వాస సంబంధిత వ్యాధులు, కళ్ళు తిరగటం వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఈ లక్షణాలు కనిపించగానే దగ్గర్లోని డాక్టర్ ని సంప్రదించటం చాలా అవసరం. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.