ఈ రోజుల్లో ఆల్కహాల్ సేవించి ప్రతివారు చెప్పే మాట అధిక ఒత్తిడి నుండి బయటపడి రిలాక్స్ అవ్వడానికి రోజుకు రెండు పెగ్గుల మందు లేదా చల్ల చల్లని బీర్లు తాగుతుంటామని చెబుతుంటారు. పైగా ఈ రోజుల్లో స్త్రీ పురుషులు బీరు తాగడం లైఫ్ స్టైల్ లో భాగంగా మారుతోంది. ఏదో సరదాగా బీరు తాగడం అలవాటై చివరకు ఆల్కహాల్ కు బానిసగా మారుతున్నారు. చాలామంది బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు అది కేవలం వారి అపోహ మాత్రమే వైద్యుల సూచన ప్రకారం ఆల్కహాల్తో కూడుకున్న ఎటువంటి పదార్థమైన మన ఆరోగ్యానికి హానికరమే అన్నది గుర్తుంచుకోవాలి.
తరచూ బీరు తాగే వారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బీర్ లో 5 % ఆల్కాహాల్ ఉంటుంది. 100 ఎమ్ ఎల్ బీర్ లో 35 నుండి 40 కిలో క్యాలరీల శక్తి లభ్యమవుతుంది. అంటే ఒక బీరు బాటిల్ సేవిస్తే 200 క్యాలరీల శక్తి
లభిస్తుందన్నమాట. బీరు తాగడం మొదలెట్టక ఒకటి తో ఆపరు కదా. దాంతో అధిక కేలరీలు శరీరంలో చేరి మీ శరీర బరువు నియంత్రణ కోల్పోతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో కాలేయ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా కాలేయంలో వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియ ఆగిపోతుంది.
తద్వారా లివర్ ఇన్ఫెక్షన్స్,ఫ్యాటీ లివర్, ఊబకాయం, బాణ పొట్ట వంటవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బీర్ ఎక్కువగా సేవించినప్పుడు ఇందులో ఉండే ఆల్కహాల్ ను బయటికి పంపడానికి మనలో యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా శరీరంలోని లవణాలు విటమిన్స్ మినరల్స్ మూత్రం ద్వారా కోల్పోవాల్సి వస్తుంది.అలాగే బీర్ ఎక్కువగా తాగడం వల్ల విటమిన్స్, మినరల్స్ ను గ్రహించుకునే శక్తి మూత్రపిండాలు కోల్పోతాయి. మినరల్స్, విటమిన్స్ కోల్పోవడం వల్ల రక్తంలో క్షారత్వం తగ్గుతుంది.దీంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం రక్తంలో కలిసి రక్తంలో క్షారత్వం తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. దీని ఫలితంగా ఎముకల్లో పట్టుత్వం తగ్గి పేలుసుగా మారుతాయి.