మన శరీరం సగం కంటే ఎక్కువ భాగం నీటితో నిండిపోయి ఉంటుంది. రోజువారీ జీవన క్రియలన్నింటికీ నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, “ఆహారం తినేటప్పుడు నీరు తాగాలా? లేక తిన్న తర్వాత తాగాలా?” అనే సందేహం చాలా మందినికి వస్తుంటుంది. ఈ ప్రశ్నకు వైద్య నిపుణులు, ఆయుర్వేదం రెండూ కొన్ని స్పష్టమైన సమాధానాలు ఇస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజన సమయంలో కొద్దిగా నీరు తాగడం శరీరానికి సహజమే. ఇది ఆహారం సులభంగా మింగడానికి, జీర్ణవ్యవస్థకు సులభతరం కావడానికి తోడ్పడుతుంది. కానీ అదే నీటిని అధికంగా తాగితే జీర్ణరసాలు పలచబడి ఆహారం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. దీని ఫలితంగా గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు రావచ్చు.
తిన్న వెంటనే నీటిని ఎక్కువగా తాగితే ఇన్సులిన్ స్థాయి పెరిగి బరువు పెరగడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి శరీరం అలసటగా అనిపించవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తిన్న వెంటనే నీరు తాగితే సమస్యలు ఎక్కువవుతాయి.
ఇక తినే ముందు నీరు తాగడం బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. భోజనం చేయడానికి 15 నుంచి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీరు తాగితే ఆకలి నియంత్రణలోకి వస్తుంది. అధికంగా తినకుండా నిరోధించడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం భోజనం చేస్తూ ఉన్నప్పుడు కేవలం తక్కువ మోతాదులోనే నీరు తాగాలి. ఎక్కువగా తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నీరు తాగడం ఉత్తమమని చెబుతున్నారు. ఇక వైద్యులు మరో విషయం సూచిస్తున్నారు నీటిని ఎప్పుడూ కూర్చొని తాగడం మంచిది. అలాగే గ్లాసును ఒక్కసారిగా పూర్తిగా తాగకూడదు, చిన్న చిన్న ముద్దలుగా తాగితే శరీరానికి మరింత మేలు జరుగుతుంది. మొత్తం మీద, నీరు తాగడం తప్పనిసరి అయినప్పటికీ దానిని ఎప్పుడు, ఎంత మోతాదులో తాగాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. సరైన అలవాట్లు పాటిస్తే జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
