అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని మనమందరం కోరుకుంటాం కదా. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతున్నయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఏవేవో మందులు వాడుతూ ఇంకొన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి మన చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే తులసి మొక్క మన ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.తులసి ఆకులను, శెనగపిండి, పసుపు తగిన మోతాదులో వేసి మెత్తని పేస్టులా మార్చుకోవాలి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ పేస్టు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు నశించి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే
తులసి ఆకులతో నిమ్మరసం కలిపి మెత్తని పేస్టులా మార్చుకుని వారానికి రెండుసార్లు ముఖానికి పట్టించుకున్నట్లయితే ముఖంపై మచ్చలు, మొటిమలు ముడతలు తగ్గుతాయి.బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో కొంత బియ్యప్పిండి, ఆరంజ్ నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.
కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.
టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ పాలు వీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అర గంట తర్వాత క్లీన్ చేసుకుంటే పొడి వారిని చర్మం కాంతివంతంగా తయారవుతుంది.