ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతోందని అనేక సర్వేల్లో వెళ్లడైంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తితే పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు యూరిన్ విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుంది
కిడ్నీలో రాళ్ల సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని గుర్తించడం చాలా కష్టం. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక అనారోగ్య సమస్యలతో పాటు రోజువారి ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చు.
మన శరీరంలో ఉత్పత్తి అయ్యే చెడు మలినాలను బయటికి పంపడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తడానికి గల కారణాలను పరిశీలిస్తే నీటిని తక్కువగా తాగే వారిలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి అవసరమైన నీటి నిల్వలు లభించకపోతే శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం,ఫాస్ఫేట్స్,ఆక్సిలేట్స్ వంటి రసాయనాల సమ్మేళనం కిడ్నీలో చేరి రాళ్ళగా మారుతాయి.ఈ రాళ్ళు మూత్రపిండాల నుండి,మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత అద్దంకిగా మారి తీవ్రమైన నొప్పి తో పాటు కిడ్నీ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
మరికొందరిలో కిడ్నీలో రాళ్ల వంశ పారంపర్యంగా కూడా ఏర్పడతాయి. ఇలాంటి సూచనలు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రమైన కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చు.కొన్ని అధ్యయనాల ప్రకారం షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎక్కువగా కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దీని ప్రకారం షుగర్ వ్యాధి కూడా కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణమని చెప్పొచ్చు. రోజువారి ఆహారంలో మోతాదుకు మించి ఉప్పును ఆహారంగా తీసుకుంటే భవిష్యత్తులో కచ్చితంగా కిడ్నీ సమస్యలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.