మన శరీరానికి ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు అవసరమనే విషయం మనకు తెలిసిందే ఇలా పోషక విలువలు కలిగిన వాటిలో వాల్నట్స్ ఒకటి .వాల్ నట్స్‌లో విటమిన్ E , ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచూ వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మిన్నె సోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వాల్ నట్స్ తింటే గుండె జబ్బులు తక్కువగా వస్తాయని కనుగొన్నారు. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఆవశ్యక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని న్యూయార్క్ లోని కెల్మాన్ వెల్నెస్ సెంటర్ లో క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లారెన్ పెల్లెహాచ్ చెప్పారు.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె జబ్బులు రాకుండా చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న వాల్ నట్స్ తినడం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు నష్టాన్ని తగ్గించి, అభిజ్ఞా విధులను కూడా మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని కొన్ని తిన్న కడుపు నిండిన భావన కలగడంతో శరీర బరువును తగ్గించడంలో ఎంతో దోహదపడతాయి. ఇక అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను నశింప చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.