Eye: డిజిటల్ విప్లవంతో కంటికి శ్రమ..! ఆరోగ్యానికి ఈ ఆహారం అవసరం..!

Eye: ప్రస్తుత జనరేషన్ లో కళ్లకు శ్రమ ఎక్కువైపోయింది. నిద్ర తక్కువైపోతోంది. డిజిటల్ విప్లవం ప్రారంభం అయ్యాక ఇది మరింత ఎక్కువైపోయింది. ప్రతీ విషయం మొబైల్లో అందుబాటులో ఉండటం.. సినిమాలు, వెబ్ సిరీస్, గేమ్స్, వార్తలు, యూట్యూబ్, సోషల్ మీడియా.. ఇలా అన్నింటితో కళ్లకూ.. వంటికి కూడా శ్రమ పెరిగిపోయింది. ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా కళ్లకు శ్రమ పెరిగి, పొడిబారి, నిద్రలేమి నుంచి కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు.

కళ్లు ఎంతో సున్నితమైనవి. కళ్లకు హాని జరిగితే క్యాటరాక్ట్, గ్లకోమా సమస్యలు రావొచ్చు.. ఒక్కోసారి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇందుకు మంచి ఆహారం ఎంతో అవసరం. బలమైన ఆహారం ద్వారా కంటి చూపును కాపాడుకుంటూ.. కంటికి హాని చేసే వైరస్‌, బ్యాక్టీరియాను అడ్డుకోవచ్చు. జింక్.. కంటి రెటీనాను కాపాడుతుంది. లివర్ నుంచి విటమిన్ ఎను కంటి వరకూ చేర్చడంలో జింక్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రే చీకటి సమస్య రాకుండా కాపాడుతుంది. కూరగాయలు, పండ్లు, గింజలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, ధాన్యాలు, బచ్చలి, పుట్టగొడుగులు, మాంసం తినాలి.

కంటికి విటమిన్ ఎ చాలా మంచిది. కంటి లోపలి కార్నియాను, కంటి బయటి పొరను రక్షిస్తుంది.  కంటి చూపును నిలబెడుతుంది. రెటీనా బాగా పనిచేసేలా, కాంతిని మెదడులోని నరాలకు పంపేలా.. రంగులు గుర్తించేలా చేస్తుంది. ఇవన్నీ దక్కాలంటే బత్తాయి, బొప్పాయి, క్యారెట్, గుడ్లు, మామిడి, ఆప్రికాట్స్, వెన్న, ఆవకాడో, దుంపలు, బ్రకోలి, చేపలు తినాలి. విటమిన్ సి.. కంటికి చాలా అవసరం. కంటిపై పడే ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. కంటికి హాని చేసే వ్యర్థాలు రాకుండా, క్యాటరాక్ట్ సమస్య రాకుండా చేస్తుంది. కార్నియాను రక్షిస్తుంది. పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఆకుకూరలు, టమాటాలు, చిక్కుడు కాయలు, బ్రకోలి, బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, చిలకడదుంప,  బంగాళాదుంప, కొత్తిమీర తినాలి.

లుటెయిన్ అనే పోషకం.. రంగుల్ని గుర్తించే రెండు కెరోటెనాయిడ్స్‌‌లో ఉంటుంది. ఎండ నుంచి కళ్లలోని కణాల్ని కాపాడుతుంది. పెరిగే వయసుతోపాటు కోల్పోయే చూపును ల్యూటెయిన్ కాపాడుతుంది. ఇందుకు తోటకూర, బచ్చలి, బ్రకోలి, బఠాణీలు, పండ్లు, మొక్కజొన్న, చేపలు, గుడ్లు తీసుకోవడం బెటర్.
కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి చూపును మెరుగవ్వాలన్నా.. జీక్సాన్‌థిన్ అవసరం. కంటిపై పడే కాంతిని అడ్జస్ట్ చేస్తుంది. టీవీలు, మొబైల్ ఫోన్లలో ఉండే బ్లూ లైట్ వల్ల కంటికి హాని కలుగకుండా చేస్తుంది. ఇందుకు బచ్చలి, మొక్కజొన్న, గుడ్లు, బఠాణీలు, చిక్కుడుకాయలు, బ్రకోలి తినడం ఉత్తమం.

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.