Egg Shell: గుడ్డు తిన్నాక పెంకులు పారేస్తున్నారా.. ఈ వేస్ట్ తోనే ఆరోగ్యం, అందం, గార్డెన్‌కి అద్భుత లాభాలు..!

గుడ్లు పేదవాడి పోషకాహారం అని చెబుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారాల్లో గుడ్లకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ మనలో చాలా మంది గుడ్డు తిన్న వెంటనే పెంకులను చెత్తలో పడేస్తారు. అయితే ఆ ‘వేస్ట్‌’ అనుకున్న పెంకులలోనే ఆరోగ్యానికి, గార్డెన్‌కు, చర్మానికి దాగి ఉన్న ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? నిపుణుల ప్రకారం గుడ్డు పెంకుల్లో ఉన్న కాల్షియం, మినరల్స్, కొల్లాజెన్ పదార్థాలు అద్భుతమైన గుణాలు కలిగి ఉంటాయి. ఒకసారి వాటి వినియోగాల గురించి తెలుసుకుంటే.. ఇక వాటిని పడేయాలనే ఆలోచనే రాదు.

గుడ్డు పెంకుల్లోని సహజ పదార్థాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. శుభ్రంగా కడిగిన పెంకులను ఒక గాజు సీసాలో వేసి, అవి మునిగేంత వరకు Apple cider vinegar పోయాలి. రెండు రోజుల తర్వాత ఈ మిశ్రమంలో పెంకులు కరిగి పోషకాలు వెనిగర్‌లో కలుస్తాయి. ఈ ద్రావణాన్ని మోకాళ్లు, మోచేతుల మీద రాస్తే కీళ్ల నొప్పుల్లో ఉపశమనం లభిస్తుంది. చాలామంది ఈ పద్ధతిని నేచురల్ రిమెడీగా వాడుతున్నారు.

ఇంట్లో వంట పాత్రలపై ఉండే మొండి మరకలతో చాలామందికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఎండిన గుడ్డు పెంకుల పొడి ఒక సహజ స్క్రబ్బర్‌లా పని చేస్తుంది. పొడిగా చేసిన పెంకుల మీద కొద్దిగా సబ్బు నీళ్లు వేసి రుద్దితే కెమికల్స్ అవసరం లేకుండానే ప్యాన్‌లు మెరిసిపోతాయి. ఇక కాఫీ ప్రేమికులకు కూడా గుడ్డు పెంకులు ఉపయోగపడతాయి. కాఫీ పొడిలో కొద్దిగా పెంకుల పొడి కలపడం వల్ల ఎసిడిటీ తగ్గి, చేదు రుచి సాఫ్ట్‌గా మారుతుంది. పెంకుల్లోని కాల్షియం కార్బోనేట్ చేదును కంట్రోల్ చేస్తుంది. అదీ కాక, కాఫీ మడ్డ గిన్నె అడుగున కూర్చుని కాఫీ స్పష్టంగా ఉంటుంది.

గుడ్డు పెంకులు పక్షులకు కూడా అద్భుతమైన సప్లిమెంట్‌. గూడు కట్టుకునే సమయంలో ఆడ పక్షులకు ఎక్కువ కాల్షియం అవసరం. ఈ పెంకులను శుభ్రంగా కడిగి, తక్కువ ఉష్ణోగ్రతలో 10 నిమిషాల పాటు కాల్చి, మెత్తటి పొడిలా చేసి బర్డ్ ఫీడర్‌లో కలిపి ఇవ్వవచ్చు. ఇది వాటి ఎముకలు, గుడ్లు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

తోట ప్రేమికులకైతే గుడ్డు పెంకులు సహజ ఫెర్టిలైజర్. పెంకుల్లోని కాల్షియం, మినరల్స్ మొక్కలకు పుష్కల పోషకాలు అందిస్తాయి. ముఖ్యంగా టమాటా, మిరప వంటి మొక్కల్లో ‘బ్లాసమ్ ఎండ్ రాట్’ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. పెంకులను పొడిగా చేసి మొక్కల చుట్టూ చల్లడం సరిపోతుంది. నెమ్మదిగా మట్టిలో కలిసే ఈ పొడి మొక్కల ఎదుగుదలకు బలాన్ని ఇస్తుంది.

అందాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా ఈ పెంకులు ఉపయోగపడతాయి. ఒక టీస్పూన్ పెంకుల పొడిలో తేనె కలిపి పేస్ట్ తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగి, ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది ఖరీదైన కాస్మెటిక్స్‌కి సహజమైన, చవకైన ప్రత్యామ్నాయం. నిపుణుల సూచన ప్రకారం గుడ్డు పెంకులను వాడేముందు శుభ్రంగా కడిగి, ఎండబెట్టడం తప్పనిసరి. ఇలా చేస్తే బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఒక చిన్న వేస్ట్ అనుకున్న పెంకు ఈన్ని ఉపయోగాలు చేస్తుందని అనుకోవడం కూడా ఆశ్చర్యమే కదా! ఇకపై వాటిని పడేయకండి… ఇంటి గార్డెన్‌కి, ఆరోగ్యానికి, చర్మానికి సహజ పరిష్కారంగా ఉపయోగించండి.