రెడ్ మీట్ ఎక్కువగా తింటున్నారా … వైద్యున్ని సంప్రదించాల్సిందే?

ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ను రోజువారి ఆహారంలో తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, కొవ్వు పదార్ధం,ఐరన్, జింక్, విటమిన్ డి, కాల్షియం వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించి మన శరీరంలోని ఎముకలు, కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. అసలు రెడ్ మీట్ అంటే ఏమిటి. రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యానికి కలిగే లాభాలు నష్టాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్షీరధాలైన గొర్రెలు, మేకలు, పందులు, గొడ్డు నుంచి సేకరించే మాంసాన్ని ఎర్ర మాంసం లేదా రెడ్ మీట్ అంటారు. వీటి మాంసంలో అత్యధిక ప్రోటీన్స్ ఉండడం వల్ల పోషకాహార లోపంతో బాధపడే వారికి రెడ్ మీట్ ఆహారంగా తీసుకుంటే ప్రోటీన్స్ సమృద్ధిగా లభించి మన శరీరానికి అవసరమైన శక్తిని పొందవచ్చు. బరువు తక్కువగా ఉంది రక్తహీనత సమస్యతో బాధపడేవారు రెడ్ మీట్ ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

అయితే ఇంకొందరి వాదనల ప్రకారం రెడ్ మీట్లో హానికర కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి ఉబకాయం,గుండె జబ్బులు,అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వాదిస్తున్నారు.

ప్రజల్లో రెడ్ మీట్‌ తినడంపై ఉన్న సందేహాలను తొలగించేందుకు అమెరికాకు చెందిన ఎపిడిమిలోజిస్ట్ జెఫ్రీ స్టాన్‌వే నేతృత్వంలోని కొందరు వైద్య నిపుణులు రెడ్ మీట్ ను ఎక్కువగా తినే వారిపై పరిశోధనలు చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
రెడ్ మీట్ ను ప్రతీ రోజూ తినడం వల్ల 16% గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ,ఉదర క్యాన్సర్, ఉబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వీరిలో వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది. రెడ్ మీట్ ను ఎక్కువగా తినేవారు తరచూ వైద్య సలహాలు తీసుకోవడం మంచిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.