వాతావరణం లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఒంట్లో తేమ మొత్తం క్షణంలో ఖాళీ అవుతుంది. తద్వారా చర్మకణాలు నశించిపోయి పొడిబారడం జరుగుతుంది. చర్మ కణాలను తిరిగి ఉత్తేజపరిచి సహజ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవాలంటే మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడానికి బదుల మన ఇంట్లోనే తేనె, పాలు, అవకాడో గుజ్జును ఉపయోగించి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పొడివారి నిర్జీవంగా మారిన చర్మాన్ని సహజ పద్ధతిలో మెరుగుపరుచుకోవాలంటే ముందుగా ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు మెండుగా ఉన్న బాగా పండిన అవకాడ ఫ్రూట్ ను తీసుకొని మెత్తని గుజ్జుగా మార్చుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, తగినన్ని ఓట్స్ వేసుకొని మిక్సీలో మెత్తటి మిశ్రమంగా తయారు చేసుకొని పది నిమిషాల పాటు నానబెడితే సహజ ఫేస్ ప్యాక్ రెడీ అయినట్లే.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పొడి బారిన చర్మం పై సున్నితంగా పూసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు ట్రై చేస్తే పొడిబారిన చర్మానికి సహజ పద్ధతిలో తేమ లభించి చర్మకణాలను ఉత్తేజితం చేసి సహజ చర్మ సౌందర్యం పెంపొందుతుంది. ఈ ప్యాక్ లో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్ లక్షణాలు చర్మంపై వచ్చే ముడతలు, మచ్చలు, నల్లని వలయాలను తొలగించి వృద్ధాప్య లక్షణాలను తరిమికొస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోలేని వారు మార్కెట్లో దొరికే అవకాడ నూనెను ఉపయోగిస్తే పొడిబారిన చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడుతుంది.