ఖాళీ కడుపుతో పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?

ప్రతి రోజు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యంగా పాలు, పెరుగు వాడకం అనేక మందికి దినచర్యలో భాగం. శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. కానీ ఒక చిన్న తప్పిదం చేసినా ఇవి లాభాల కంటే నష్టాలు ఎక్కువ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకోవడం శరీరానికి మేలు చేయకపోగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.

చాలా మంది నిద్ర లేవగానే వేడి పాలు తాగడం లేదా ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేసుకుంటారు. అయితే ఖాళీ కడుపులో పాల ఉత్పత్తులు చేరడం వల్ల కడుపులో సహజ యాసిడ్ ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంటున్నారు. దీని ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయంట. పెరుగు విషయంలోనూ అదే పరిస్థితి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా సాధారణంగా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. కానీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆమ్లత్వం పెరిగి యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు రావచ్చు.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. పాలు, పెరుగు తీసుకోవడానికి సరైన సమయం అల్పాహారం తర్వాత. ఉదయం కొంత ఆహారం తీసుకున్న తర్వాత ఇవి తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అంతేకాదు శరీరం అవసరమైన పోషకాలను బాగా గ్రహించగలదు. రాత్రివేళల్లో పాలు తాగడం కూడా చాలా ప్రయోజనకరమని వైద్యులు సూచిస్తున్నారు. పడుకునే ముందు పాలు తీసుకుంటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

పాలు, పెరుగు కేల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు అందిస్తాయి. కానీ వాటి వాడకం తప్పుగా జరిగితే సమస్యలే తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే పాలు, పెరుగు తీసుకోవడంలో సరైన సమయం పాటించడం చాలా ముఖ్యం.