చర్మ సౌందర్య లేపనంగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు మృదువుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో తోడ్పడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుల్లో వేగంగా మారుతున్న
వాతావరణ మార్పుల కారణంగా చాలా మందిలో చర్మం తన సహజ తేమ శాతాన్ని కోల్పోయి చర్మం పొడి బారడమే కాకుండా అనేక చర్మ సమస్యలకు కారణం అవుతుంది.అలాంటి పరిస్థితుల్లో ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనె వాడితే ఎంతో మేలు చేస్తుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల వృద్ధాప్య రూపాన్ని నివారించుకోవచ్చు. కావున కొబ్బరి నూనెను తరచు వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖంపై ముడతల సమస్యలు పోవాలంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నూనెలో పంచదార కలిపి ముఖంపై బాగా మర్దన చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలకు చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మృత కణాలు తొలగించబడి చర్మం సహజ కాంతిని సంతరించుకోవడమే కాకుండా ముడతల సమస్య కూడా తొలగిపోతుంది.

కొబ్బరి నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలను తగ్గించి మీలో వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది.కొబ్బరి నూనెకు టేబుల్ స్పూన్ పసుపు కలిపి వారానికి ఒకసారి ముఖంపై మర్దన చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గించ‌డంతో పాటు మొటిమల వ‌ల్ల వ‌చ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది.తీవ్రమైన వేడి కారణంగా సున్నితమైన చర్మ కణాలు నశిస్తాయి కావున ప్రతిరోజు కొబ్బరి నూనెతో చర్మంపై మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె గొప్ప శరీర మాయిశ్చరైజర్‌గా పనిచేసి పొడిబారినచర్మాన్ని రిపేర్ చేస్తుంది.