తులసి ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్నారా! ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే..

పురాతన ఆయుర్వేద వైద్యంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఇవ్వబడి కొన్ని వేల సంవత్సరాలుగా తులసి మొక్కను పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా చెప్పవచ్చు. తులసి మొక్కలోని ఔషధ గుణాలు ఎన్నో ప్రమాదకర మొండి వ్యాధులను సైతం రూపుమాపగలదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి కారణం ఈ మొక్కలోని ఔషధ గుణాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి మనలో సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాయని పురాతన ఆయుర్వేద గ్రంధాల్లో స్పష్టం చేయబడింది.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి మొక్క ఆకులను లేదా తులసి రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అనేక అలర్జీల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులను,తులసి రసాన్ని గాని సేవించడం అంత మంచిది కాదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

అధిక రక్తస్రావం సమస్య ఉన్నవారు తులసి ఆకులను తులసి రసాన్ని ఎక్కువగా తీసుకుంటే రక్త ప్రసరణ వేగం పెరిగి రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. తులసి ఆకుల్లో ఎస్ట్రాగోల్ అనే రసాయనం కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది అందుకే తులసి ఆకులను ఉదయాన్నే పరగడుపున తినకూడదని చెబుతుంటారు. తులసి ఆకుల్లో కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి ఈ ఆకులను నేరుగా తింటే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అందుకే తులసి ఆకులను నేరుగా తినడం కన్నా కషాయంగా మార్చుకొని తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.

గర్భిణీ మహిళలు తులసి కషాయాన్ని తగు మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు అయితే మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో వేడి పెరిగే ప్రమాదం ఉంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తి తక్కువగా ఉండి రక్తహీనత సమస్యతో బాధపడేవారు తులసి ఉత్పత్తులను ఎక్కువగా వాడితే రక్తం మరింత పలుచబడే ప్రమాదం ఉంది. తులసి కషాయాన్ని ఎక్కువగా తాగితే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.