ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారని పిస్తా పప్పు ను అధికంగా తినేస్తున్నారా! ఒక క్షణం ఆగండి ఇప్పుడు చెప్పే విషయం తెలిస్తే ఆ పొరపాటు ఇక ఎప్పటికీ చేయరు. పిస్తా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఎటువంటి సందేహం లేదు. పిస్తా పప్పులో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్స్ , విటమిన్స్, మినరల్స్, అమైనో ఆమ్లాలు, ఎంజైములు వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచివని పిస్తా పప్పును ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.
పిస్తా డ్రైఫ్రూట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ తో పాటు అత్యధికంగా కేలరీలు,కార్బోహైడ్రేట్స్, కొవ్వులు కలిగి ఉంటుంది కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు వీటిని మోతాదుకు మించి తింటే బరువు తగ్గడం ఏమో కానీ శరీర బరువు తొందరగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున వైద్య సలహాలు మేరకు వీటిని తగిన పరిమాణంలో తింటే సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవచ్చు.
రక్తపోటు సమస్య ఉన్నవారు పిస్తాను ఎక్కువగా తింటే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాల్టెడ్ పిస్తా తినడం వల్ల మీ రక్తంలో సోడియం స్థాయి బాగా పెరుగుతుంది. దీనివల్ల రక్తం పలుచబడి రక్త ప్రసరణ సాధారణ వేగం కంటే పెరిగి గుండె దడ, గుండె నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పిస్తా పప్పులు ఎక్కువగా తినడం వల్ల తేలికపాటి తలనొప్పి, కంటి చూపు మసకబారడం, గందరగోళం, మూర్ఛ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అత్యధిక ప్రోటీన్స్, ఫైబర్ కలిగిన పిస్తా పప్పును ఎక్కువగా తినడం వల్ల జీర్ణం అవడంలో సమస్య తలెత్తి మలబద్ధకం, ఎసిడిటీ కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.పిస్తాపప్పులో ఆక్సలేట్స్, మెథియోనిన్ ఉంటాయి. పిస్తాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఆక్సలేట్స్, మెథియోనిన్ విడుదల పెరుగుతుంది. ఆక్సలేట్ కాల్షియం, పొటాషియాన్ని బంధిస్తుంది. వీటివల్ల కాల్షియం, పొటాషియం లుఆక్సలేట్లుగా ఏర్పడతాయి. అలాగే మెథియోనిన్ సిస్టీన్ గా మారొచ్చు. ఈ సిస్టిన్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారికి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.