ప్రక్క భాషలో హిట్టైన సినిమాని తీసుకువచ్చి రీమేక్ చేస్తూంటారు..అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ ఓ భారీ చిత్రాన్ని రీమేక్ చేయాలని మాత్రం ఎవరూ అనుకోరు. టైటానిక్, బాహుబలిలాంటి సినిమాలని రీమేక్ చేస్తూ ఎంత ఖర్చుపెట్టినా ఎంక కష్టపడినా మరోసారి ఆ మ్యాజిక్ అయితే జరగదు. కానీ కొందరు అది గమనించరు. బాహుబలిని సైతం రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తూంటారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు,గౌరవం తీసుకువచ్చిన విజువల్ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. స్టార్స్ నటించిన చాలా హాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్లు సాదించిన బాహుబలి అక్కడ వారిని సైతం ఆకట్టుకుంది. అలాంటి భారీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట.
వందకోట్ల బడ్జెట్‌తో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని గుజరాతీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే నిర్మాతలు నితిన్ జానీ, తరుణ్ జానీ రీమేక్ హక్కులను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే హిందీలోనూ చాలా సార్లు టీవీల్లో సైతం వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తే బిజినెస్ పరంగా వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు అక్కడ ట్రేడ్ లో సైతం కలుగుతున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారట.