జగన్ నేర్చుకోవాల్సింది ఏమిటి?

YS Jagan should learn something from KCR

తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో ఎవరూ అనుకోని విధంగా అధికారపార్టీ అభ్యర్థి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విజయాన్ని రఘునందన్ వ్యక్తిగత విజయం అని భావిస్తున్నారు పరిశీలకులు. అయితే ఆయన నిలబడింది పార్టీ తరుపున కాబట్టి ఆ విజయం పార్టీ ఖాతాలోకి మాత్రమే వెళ్తుంది అని మరికొందరు వాదిస్తారు. వ్యక్తిగతంగా చాలా పరువు ప్రతిష్టలు కలిగినవారు స్వతంత్రులుగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఇదే రఘునందన్ రావు గతంలో రెండు సార్లు ఓటమి చెందారు. అందులో ఒకటి దుబ్బాకలోనే. అప్పుడు ఆయన భాజపా టికెట్ మీద పోటీ చేసారు. కానీ గెలవలేదు. ఈ సారి మళ్ళీ భాజపా టికెట్ మీద పోటీ చేసి గెలిచారు కాబట్టి భాజపా పుంజుకుంటున్నది అని వాదనలు వినిపిస్తున్నారు భాజపా వారు.

YS Jagan should learn something from KCR
YS Jagan should learn something from KCR

ఆ సంగతి అలా ఉంచితే గత ఆరేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నది. అందుకోసం వేలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. అయినప్పటికీ పార్టీ ఓడిపోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత ఏడాదిన్నర కాలంలో సుమారు అరవై వేలకోట్ల రూపాయలను ప్రజాసంక్షేమానికి ఖర్చు చేసారు. అనేక రకాల పధకాల పేర్లు చెప్పి లక్షలాది కుటుంబాలకు డబ్బును పంచుతున్నారు. తన పధకాల ద్వారా లబ్ది పొందినవారు తనకు శాశ్వతంగా ఓట్లు వేస్తారని ఆయన నమ్ముతున్నట్లుంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే రైతులు ఉపయోగించే విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతారని అధికార పార్టీ భయపెట్టింది. అయినప్పటికీ ఓటర్లు బీజేపీనే గెలిపించారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న సంక్షేమ ఫలాలను కూడా మర్చిపోయారు.

దీన్ని బట్టి చూస్తే కేవలం సంక్షేమ పధకాల ద్వారా ఓట్లను తమ బ్యాంకులో వేసుకోవచ్చని భావిస్తే అది వెఱ్ఱితనమే అవుతుంది. ఇప్పటివరకు జగన్ పంచిన డబ్బులో సగం ఖర్చు చేసినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అంది ఉండేదని, అనేక పట్టణాలకు తాగునీరు లభించి ఉండేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎవరో రైతులకు, ఆర్ధికంగా బలహీనులకు కొన్ని పధకాలు అమలు చేసినా తప్పు లేదని, కష్టించి పనిచేసుకుంటూ సంపాదించుకునేవారికి కూడా పధకాల పేరుతో కోట్ల రూపాయలను పంచడం నిష్ప్రయోజనం అని విద్యావంతులు భావిస్తున్నారు. రేపు మరెవరైనా ఇంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని వాగ్దానం చేస్తే జగన్ ప్రస్తుతం ఇస్తున్న పధకాలను వదిలేసి ఆ పార్టీకి ఓట్లు వేస్తారని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి ఇకనైనా జగన్ మేలుకుని సంక్షేమ పధకాలను కొద్దిమందికి పరిమితం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గెలుపును అందివ్వలేవని దుబ్బాక ఉపఎన్నిక స్పష్టం చేసిందని , దాన్ని చూసి జగన్ పాఠాలు నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.