మనం నాశనమైనా పర్వాలేదు.. పక్కవాడు మాత్రం బాగుపడకూడదు అనుకోవడం అనేది కుంచిత స్వభావం. అలాగే మన మీద పడే రాళ్లను దాచిపెట్టుకుని, దెబ్బల్ని కవర్ చేసుకుని పక్కవారి మీద పడే రాళ్లను లెక్కపెట్టుకోవడం కూడ అలాంటిదే. సరిగ్గా ఇదే స్వభావం వైసీపీలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వైసీపీ నాయకులకు ఎంతసేపూ తెలుగుదేశం పార్టీని ఎవరు దూషిస్తున్నారు, చంద్రబాబును ఎవరు చెడుగుడు ఆడుకుంటున్నారు అనే ధ్యాసే తప్ప తమను ఎవరెవరు ఎన్ని మాటలు అంటున్నారో సోయి లేకుండా పోయింది. టీడీపీని ఎవరైతే ఏకిపారేస్తున్నారో వారే కాస్త వెనక ముందు వైసీపీని కూడ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే వైసీపీ, వారి అనుకూల మీడియా, చివరకు కార్యకర్తలు సైతం గ్రహించలేకపోతున్నారు.
వీర్రాజు మిమ్మల్నీ ఆడుకున్నారు జగన్ :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుఈరోజు ఒక సమావేశంలో మాట్లాడుతూ చెలరేగిపోయారు. కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమైన మత భాషలో మాట్లాడుతూ ఎవ్వరినీ వదలకుండా అందరినీ చెడుగుడు ఆడుకున్నారు. ఆంధ్రాలో క్రిస్టియానిటీని పెంచి పోసిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటకు ముందు వెనక తమ ఎజెండా హిందూత్వమన్న ఆయన అసలు ఆ హిందూత్వం అంటే ఏమిటో సెలవివ్వలేదు. కానీ రాష్ట్రంలో హిందూ మతం మీద దాడి జరుగుతోందని విరుచుకుపడ్డారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తొలి తాంబూలం టీడీపీకి ఇచ్చారు. టీడీపీ రాజకీయ లబ్ది కోసం, ఓటు బ్యాంకు కోసం క్రైస్తవ మతాన్ని ప్రొత్సహించిందని అన్నారు.
వరుసగా టీడీపీ తన మేనిఫెస్టోలో క్రైస్తవుల సంక్షేమం కోసం ప్లాన్ చేసిన పథకాలను ప్రస్తావించారు. జిల్లాకో క్రైస్తవ భవనం, విదేశీ విద్యకు 25 లక్షల మంజూరు, జెరూసలెం యాత్రకు బడ్జెట్ పెంచడం, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి, పాస్టర్లకు ఉచిత గృహ వసతి లాంటి హామీలను ఉటంకించి ఇంతకంటే ఏం కావాలి రాష్ట్రంలో హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారని చెప్పడానికి అంటూ ఆ వెంటనే వైసీపీ విషయానికి వచ్చారు. వాస్తవానికి జగన్ గత ప్రభుత్వంతో పోలిస్తే తన హయాంలో క్రైస్తవులకు మేలు చేకూర్చేలా మేనిఫెస్టో పెట్టుకున్నారన్నది నిజం. దీన్నే వీర్రాజు ఏకేశారు. క్రైస్తవ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్ కానుక కింద లక్ష ఇవ్వడం, పాస్టర్లకు వివాహ రిజిస్ట్రార్ లైసెన్స్ పద్దతి సులభతరం, పాస్టర్లకు 5 వేలు తగ్గకుండా గౌరవ వేతనం, ఉచిత ఇళ్ల స్థలాలు, క్రైస్తవులకు ప్రమాద భీమా ఇలా టీడీపీకి మించి జగన్ క్రిస్టియానిటీని ప్రోత్సహించినట్టు విరుచుకుపడ్డారు. నిజం చెప్పాలంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి రాష్ట్రంలో హిందూ మతం దాడులకి గురవుతుందన్నట్టు మాట్లాడారు.
ధైర్యం లేకనే మౌనమా ?
అంతర్వేది రథం దగ్దమైన వివాదాన్ని అడ్డంపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వీర్రాజు రాష్ట్రంలో హిందూత్వాన్ని కాపాడేది తామొక్కటేనని పదే పదే అన్నారు. కానీ ఇవేవీ వైసీపీ నేతలకు వినపించలేదో వినిపించ్నట్టు నటిస్తున్నారో కానీ ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. ఎంతసేపూ సోము వీర్రాజు టీడీపీని తిట్టారు, చంద్రబాబును తప్పుబట్టారు అంటున్నారే తప్ప తమని ఎమన్నారో మాత్రం ప్రస్తావించట్లేదు. వీర్రాజు ప్రసంగంలో వారికి కనిపించిన ప్రధాన అంశమల్లా ఆయన టీడీపీకి ఎన్డీయే గేట్లు ఎప్పటికీ మూసే ఉంటాయనే స్టెట్మెంట్ ఒక్కటే. దాన్ని పట్టుకుని బాబు బీజేపీతో కలవాలని అనుకుంటుంటే బీజేపీ ఆయన్ను తరుముతోందని విశేషంగా ప్రచారం చేస్తున్నారు.
ఇక వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా విభాగాలయితే సోము వీర్రాజు బాబు గురించి చెప్పిన మాటల్ని మాత్రమే హైలెట్ చేస్తున్నాయి తప్ప ఎక్కడావైసీపీని విమర్శించినట్టు, మతం పేరుతో జగన్ మీద మాటల దాడి చేసినట్టు ప్రస్తావించలేదు. ఒక్కసారి గమనిస్తే ఇంతవరకు జగన్ సోము వీర్రాజు ఎన్నిసార్లు బాహాటంగానే తనను విమర్శించినా ఎదురు చెప్పలేదు. ఈ తంతు మొత్తాన్ని చూసిన జనం ఇదేంటి నాయనా.. మరీ ఇంత దాపరికమా. చంద్రబాబును విమర్శించిన సంగతి చెబుతున్నారు సరే. దానికి రెండింతలు మిమ్మల్నీ ఆడుకున్నారు కదా. మరి దాన్ని చెప్పలేదు. జగన్ మీద ఈగ వాలనివ్వని మంత్రులు పార్టీలో బోలెడుమందున్నారు కదా ఒక్కరూ వీర్రాజు విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు. చూస్తుంటే ఈ మౌనం భయంతో కూడుకున్న బలవంతపు గౌరవం వలన వచ్చిన మౌనంలా ఉందే అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.