శరీరానికి అవసరమైన పూర్తి ప్రోటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరూ దీన్ని భోజనంలో భాగంగా పెట్టాలని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. శరీరంలో మేలు చేసే మంచి కొవ్వులు, ప్రోటీన్, విటమిన్-డి, విటమిన్-బి12, జింక్, ఐరన్ వంటి పౌష్టిక ఆహారం గుడ్డులో ఉంటుందని.. ఇది శక్తినే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గుడ్డు తింటే శరీరం దృఢంగా ఉంటుందనే మాట కొత్తది కాదు.
అయితే ఈ సూపర్ ఫుడ్ అందరికి సరిపోతుందా.. అసలు గుడ్డు తినటం వల్ల కొందరికి అనుకోని సమస్యలు వస్తాయా.. అంటే అవుననే అంటున్నారు. గుడ్ల పచ్చసొనలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణ వ్యక్తులకు పెద్ద సమస్య కాదుగాని, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా గుడ్లు తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మరింత పెరిగి గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందువల్ల డాక్టర్లు ఈ గ్రూప్ వారిని గుడ్డు పచ్చసొనను తగ్గించమని సలహా ఇస్తుంటారు.
ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా గుడ్లను ఎక్కువగా తినరాదు అంటున్నారు నిపుణులు. వీరికి ఇప్పటికే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది పరిశోధనల ద్వారా తేలింది. పైగా, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలున్నవారికి గుడ్డు తిన్నంత మాత్రాన రక్తంలో క్రియాటినిన్, యూరియా లాంటి హానికర పదార్థాల స్థాయులు పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు.
మరొక ముఖ్య విషయం.. కొందరికి గుడ్డు అలెర్జీ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లోనే కాకుండా కొందరు పెద్దలకు కూడా గుడ్డు లోని కొన్ని ప్రోటీన్లు — ముఖ్యంగా తెల్లసొనలో ఉండే ఓవల్‌బ్యూమిన్, ఓవోముకోయిడ్ — కారణంగా అలెర్జీ రియాక్షన్లు వస్తాయి. దురద, దద్దుర్లు, కడుపునొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన అనాఫిలాక్సిస్ కూడా సంభవించవచ్చు. అలాంటి లక్షణాలు ఎప్పుడైనా ఎదురైతే గుడ్డును పూర్తిగా మానేయాలని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.
అందుకే గుడ్డు ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందన్న భావనతో కాకుండా, శరీర పరిస్థితి, ఆరోగ్య సమస్యలను గమనించి, డాక్టర్ సలహాతోనే గుడ్డును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సూపర్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తినాలి అనుకోవడం కన్నా, అది మన శరీరానికి ఎంత వరకు తగ్గుతుందో ముందే తెలుసుకోవడం చాలా అవసరం. (గమనిక: ఈ సమాచారం ఇవి సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా, డైట్ మార్పులు చేయాలనుకున్నా తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.)
