రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాల్సిందే. లేకపోతే, రాజకీయంగా తమ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి, మీడియా సపోర్ట్ చాలా చాలా ఎక్కువ. సోకాల్డ్ ‘యెల్లో మీడియా’ ఆయనకు ఎంత బలమో, అంతే బలహీనత కూడా. టీడీపీని ముంచేయడంలో టీడీపీ తప్పిదాలకంటే ఎక్కువ పాత్ర ఆ యెల్లో మీడియాదే. కానీ, చంద్రబాబుకి ఆ యెల్లో మీడియాని నమ్మడం తప్ప ఇంకో దారి లేదు.
ఇదీ నిఖార్సయిన వెన్నుపోటు అంటే..
అది ఓ ప్రముఖ న్యూస్ ఛానల్.. ఆ సంస్థ నుంచి ఓ పత్రిక కూడా వుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఆ మీడియా సంస్థ అధినేతకు సంబంధించి ఉద్యోగుల ఒళ్ళు మండేలా ఓ విషయం వెలుగు చూసింది. చంద్రబాబుతో ఇంటర్వ్యూ సందర్భంగా సదరు మీడియా సంస్థ అధినేత, ఉద్యోగులపై అవాకులు చెవాకులు పేలారు. ఆ వ్యవహారాన్ని అప్పట్లో వైసీపీ బాగా క్యాష్ చేసుకుంది. వైసీపీ క్యాష్ చేసుకుందా.? లేదా.? అన్న విషయం పక్కన పెడితే, సదరు మీడియా సంస్థ అధినేత వ్యవహార శౖలి, దాన్ని చంద్రబాబు ఖండించకపోవడం.. వెరసి, టీడీపీకి ఉద్యోగ వర్గాలు 2019 ఎన్నికల్లో పెద్ద షాకే ఇచ్చాయి.
బోర్ కొట్టించేసిన ఓవర్ పబ్లిసిటీ..
టీడీపీ అనుకూల కథనాలు, వైసీపీ వ్యతిరేక కథనాలు.. వెరసి, టీడీపీకి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే నిర్లక్ష్యం వచ్చేలా చేసింది సదరు మీడియా సంస్థ. అప్పటికే కింది స్థాయిలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. కానీ, దాన్ని సదరు టీడీపీ అనుకూల మీడియా అస్సలేమాత్రం పైకి కనబడనీయలేదు. ఫలితం, టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీడీపీ మంచిని కోరాల్సిన సదరు టీడీపీ అను’కుల’ మీడియా, పరోక్షంగా టీడీపీ అంతు చూసేసినట్లయ్యింది.
ఇప్పుడూ తప్పని ‘అతి’
నిజానికి, సదరు మీడియా సంస్థకు ప్రాణం పోసింది చంద్రబాబే. ఇప్పుడే అదే మీడియా సంస్థ టీడీపీ ఉసురు తీసేస్తోంది. టీడీపీ నుంచి ఫలానా నేత ఔట్.. అనే వార్త, టీడీపీ వ్యతిరేక మీడియా కంటే ముందే, సదరు టీడీపీ అను’కుల’ మీడియా నుంచి బయటకొస్తుంటుంది. టీడీపీ రాజకీయాల్ని శాసిస్తూ, టీడీపీని భ్రష్టుపట్టిస్తున్న సదరు టీడీపీ అను’కుల’ మీడియా విషయంలో అప్రమత్తం కాకపోతే.. చంద్రబాబు శేష జీవితం మరింతగా అభాసుపాలయ్యే ప్రమాదముంది రాజకీయంగా.