‘పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం తగిన రీతిలో నిధులు ఇవ్వడంలేదు’ అని చెప్పింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. నిధులకు అనుగుణంగా ప్రాజెక్టు ఎత్తు విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వుంటుందనీ, ముంపు ప్రాంతాన్ని తగ్గించేలా నీటి నిల్వకు తగ్గట్టుగా పనులు చేపట్టాలనీ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించిన వైనం అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థల కథనాలతోనే బయటకు వచ్చింది. కానీ, ఇప్పుడేమో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గే ప్రసక్తేలేదనీ, ఎత్తు విషయంలో జరుగుతున్నది దుష్ప్రచారమేనని అంటున్నారు. ఏంటీ తేడా.? ఎందుకీ వివాదం.?
పోలవరం.. ఎందుకీ దాపరికం.?
పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన దాపరికం కనిపిస్తోంది. కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘ఎత్తు తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒప్పిందాం..’ అని చెప్పారాయన. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎవరూ దాన్ని ఖండించలేదు. ఇప్పుడు, ఇన్ని నెలల తర్వాత.. కేంద్రం, బడ్జెట్‌లో కోత విధించడంతో ఎత్తు తగ్గింపు వ్యవహారం మళ్ళీ తెరపైకొచ్చింది.
వాళ్ళు వెళ్తామంటే ఎందుకు అడ్డుకున్నట్టు.?
పోలవరం ప్రాజెక్టుని సందర్శించేందుకు వామపక్షాలు సహా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సమాయత్తమయ్యారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతినివ్వలేదు. ఈ విషయమై పెద్ద గలాటానే జరిగింది. చిత్రంగా అధికార పార్టీ నేతలు, పోలవరం ప్రాజెక్టుని చూసి వచ్చారు. ‘అంతా అద్భుతం..’ అని కితాబులు ఇచ్చేశారు కూడా. నిజానికి, పోలవరం అనేది నిషేధిత ప్రాంతం ఏమీ కాదు. దూరం నుంచి ప్రాజెక్టుని చూసేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించినట్లే కనిపిస్తోంది.
అప్పుడు పిలుస్తారట.. అప్పటిదాకా వెళ్ళొద్దట..
వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనీ, ఆ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామనీ, అప్పటిదాకా ఎవరూ అటు వైపు వెళ్ళొద్దనీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఇదెక్కడి చోద్యం.? విపక్షాలు వెళితే, పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోతాయని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా వుందా.! ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తాయన్నది నిర్వివాదాంశం.