తెలుగు సినీ పరిశ్రమకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించేశారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ అత్యంత వ్యూహంగా ఈ వరాల జల్లు కురిపించేశారు సినీ పరిశ్రమపైన కేసీఆర్. అంతే, తెలుగు సినీ ప్రముఖులంతా కేసీవఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించేయడం మొదలు పెట్టారు. దాదాపుగా భారీ వర్షమే కురిసింది.. ప్రశంసల పరంగా. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి, చిన్నా చితకా సినిమాలు నిర్మించే నిర్మాతల వరకూ.. అందరూ హ్యాపీనే కేసీఆర్ విషయంలో. మరి, ఆంధ్రప్రదేశ్ మాటేమిటి.?
తెలుగు సినిమా అంటే.. ఇక్కడా, అక్కడా.!
తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్ కేంద్రంగా వర్ధిల్లుతోంది. చెన్నయ్ నుంచి హైద్రాబాద్‌కి రావడానికే చాలా సమయం పట్టింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, హైద్రాబాద్ నుంచి సినీ పరిశ్రమ విశాఖకు వెళ్ళిపోతుందని చాలామంది భావించారుగానీ, అలా జరగలేదు. సినీ పరిశ్రమ అంటే అదొక వ్యాపారం. తెలంగాణ ఉద్యమంలో తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందుల్లేవు. అయితే, ఆంధ్రప్రదేశ్ పట్ల సినీ పరిశ్రమ చిన్న చూపు ప్రదర్శిస్తోందన్న విమర్శలు మాత్రం వున్నాయి.
కేసీఆర్‌ని కలిసినట్టుగా, వైఎస్ జగన్‌ని కలవరేం.?
కేసీఆర్‌ని అడపా దడపా సినీ ప్రముఖులు కలుస్తుంటారు. ఎందుకంటే, వాళ్ళంతా వున్నది హైద్రాబాద్‌లోనే. అదే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవాలంటే, అదో పెద్ద పని. పైగా, ఆంధ్రప్రదేశ్‌తో సినీ పరిశ్రమకి అవసరాలు తక్కువ. అందుకే, వైఎస్ జగన్‌ని లైట్ తీసుకుంటారన్న వాదన వుంది. ఇంకోపక్క, కుల సమీకరణాల ప్రస్తావన కూడా వస్తుంటుంది. అయితే, ఏ వ్యాపారవేత్త కూడా ఇలాంటి బేషజాలు ప్రదర్శించడు. సో, సినీ పరిశ్రమ కూడా అంతే.
కేసీఆర్ బాటలోనే వైఎస్ జగన్.. తప్పదా.!
కేసీఆర్ బాటలోనే వైఎస్ జగన్ కూడా సినీ పరిశ్రమకు వరాలు ప్రకటించాలి. తప్పదు. కాకపోతే, కొంత సమయం పట్టొచ్చు. ఈలోగా సినీ ప్రముఖులు వైఎస్ జగన్‌ని కలిసి విజ్ఞప్తులు చేయడానికి ఆస్కారముంది. తిరుపతి ఉప ఎన్నిక నాటికో, స్థానిక సంస్థల ఎన్నికల నాటికో.. వైఎస్ జగన్ నుంచి కూడా ఆ తీపి కబురు అందొచ్చు.