తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడే అయినా, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మాత్రం నందమూరి బాలకృష్ణ ఏనాడూ సుముఖత వ్యక్తం చేయలేదు. ‘మాకు పదవుల మీద వ్యామోహం లేదు.. మేమే పదవులకు అలంకారం.. మాకు పదవులు అలంకారం కాదు..’ అని చెబుతుంటారు నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు హయాంలో మంత్రి పదవిని బాలకృష్ణ ఆశించలేదు.. కానీ, బాలయ్యను మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో చూడాలని ఆయన అభిమానులు, చాలామంది టీడీపీ కార్యకర్తలు మాత్రం కోరుకున్నారు. ఇదిలా వుంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అత్యంత అధ్వానంగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి అంతంతమాత్రమే.
బాలయ్య.. టీడీపీకి బలం అవుతారా.?
ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ ‘బలం’ అవుతారా.? లేదా.? అంటే, ఆయన వైపు నుంచి సరైన సమాధానం రావడంలేదు. ‘నేను పార్టీలో యాక్టివ్‌గానే వున్నాను..’ అని బాలకృష్ణ చెబుతుంటారు. ‘చంద్రబాబు సమర్థుడు.. నా సేవలు పార్టీకి అవసరం అని చంద్రబాబు భావిస్తే, అప్పుడు పార్టీలో కీలకమైన పదవుల్ని స్వీకరిస్తాను..’ అని బాలయ్య చెప్పడం మామూలే. ఎలాగైతేనేం, బాలయ్యకు టీడీపీ పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. దాంతో, పార్టీ శ్రేణుల్లోని నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బాలయ్య చాలా విషయాల్లో తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడాన్ని ఇంకో వర్గం టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి.
బాలయ్య మౌనం వెనుక కారణమేంటి.!
ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు. బాలకృష్ణ అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. చంద్రబాబు పిలిస్తే, ఆయా వేదికలపై ఆవేశపూరిత ప్రసంగాలు తప్ప, ఏనాడూ ఆయన ప్రజా సమస్యల పట్ల రోడ్డెక్కింది లేదు. అసెంబ్లీలోనూ బాలయ్య ‘ప్రదర్శన’ అంతంతమాత్రమే. చిత్రమేంటంటే, బాలయ్యకు వైసీపీలోనూ అభిమానులున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా బాలయ్యకు వీరాభిమాని కావడం గమనార్హం. అయితే, రాజకీయం రాజకీయమే.. అవసరమైనప్పుడు బాలయ్యను వైసీపీ నేతలు విమర్శలతో ఉతికి పారేసిన సందర్భాలూ లేకపోలేదు.
తెలంగాణలో తొడకొట్టినా ఫలితం దక్కలేదు
తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ వీరావేశంతో ప్రచారం చేశారు. ఆ ప్రచారం పార్టీకి ఉపయోగపడలేదు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ కుమార్తె, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. ఎన్టీఆర్‌గానీ, కళ్యాణ్‌రామ్ గానీ తమ సోదరి తరఫున ప్రచారం కోసం సుముఖత వ్యక్తం చేయడం రాజకీయంగా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.ఏదిఏమైనా, తెలుగునాట రాజకీయాల్లో బాలకృష్ణ యాక్టివ్ అయితే, టీడీపీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతుందన్నది బాలయ్య అభిమానుల వాదన. టీడీపీలో నందమూరి అభిమానులదీ ఇదే అభిప్రాయం. కానీ, బావ చాటు బావమరిది బాలయ్య.. టీడీపీలో కీలక పాత్ర పోషించడం అనేది జరిగే పని కాదు. ఎన్నికల వేళ నాలుగైదు టిక్కెట్లు బాలయ్య కోటాలో కొందరికి దక్కొచ్చేమో. అంతకు మించి, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా దక్కిన పదవిని బాలయ్య ఉపయోగించుకుని.. పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారనుకోలేం.