ఈ నెల పద్దెనిమిదో తారీకు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద జన్మదినమట. అయితే అందులో విశేషం ఏమీ లేదు. కానీ స్వరూపానంద జన్మదినం రోజున ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు ప్రముఖ దేవాలయాల నుంచి అర్చకస్వాములు విశాఖ వెళ్లి స్వామివారికి ఆలయమర్యాదలు అందించాలని జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం వివాదాస్పదంగా మారుతున్నది. ప్రభుత్వ ఆలయాల అర్చకులు తీర్ధప్రసాదాలతో విశాఖ వెళ్లి ప్రయివేట్ స్వామి అయిన స్వరూపానందకు ఆలయ మర్యాదలు అందించడం చాలామంది లౌకికవాదులు మింగుడు పడటం లేదు.
స్వరూపానంద స్వామి పరంపరలోని స్వామి కాదు. అయన సొంత పీఠాన్ని స్థాపించుకుని తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. మరి ఆయనలోని గొప్పదనం ఏమిటో తెలియదు కానీ, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు రాజగురువు అయ్యారు. వారిద్దరూ ఆయన్ను చాలాసార్లు విశాఖ వెళ్లి కలిశారు. ఆయన మహాత్మ్యాలు ఏమిటో ఎవరికీ తెలియదు. మనదేశంలో గ్రామానికొక స్వామి ఉంటారు. ఇక పీఠాధిపతులకు లెక్కే లేదు. కొందరైతే పదవీవిరమణ చేసేదాకా సంసారం సుఖాలను అనుభవించి ఆ తరువాత సన్యసించి పీఠాధిపతులు అయ్యారు. శారదా పీఠం అనేది కంచి పీఠం, శృంగేరి పీఠం లాగా పరంపర కాదు. ఎంతో చరిత్ర, పురాణప్రాశస్త్యం కలిగిన ఆలయాల అధికారులు, అర్చకులు వెళ్లి స్వరూపానందకు మర్యాదలు చెయ్యడం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినదగ్గరనుంచి మతానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక వివాదాలు చెలరేగాయి. అంతర్వేదిలో రధం దగ్ధం కావడం, దుర్గా అమ్మవారి ఆలయంలో వెండి సింహాలు చోరీ కావడం, తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం లాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. వీటిని ప్రతిపక్షాలు తెలివిగా రాజకీయాలకు వాడుకుంటూ జగన్ ను దెబ్బ తియ్యాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో మతపిచ్చి లేకపోవడంతో వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అందువలన ప్రతిపక్షాల ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి.
గతంలో కంచి మహాస్వాములు స్వయంగా చాతుర్మాస దీక్ష చేపట్టి విజయవాడలో రెండు మాసాలు బస చేసినా ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోలేదు. ఒక్కరు కూడా వెళ్లి ఆ హిందూ మఠాధిపతిని పలకరించిన పాపాన పోలేదు. మరి శారదా పీఠాధిపతి విషయంలో ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారో తెలియడం లేదని భక్తులు వాపోతున్నారు. సున్నితమైన ఇలాంటి విషయాలలో జగన్ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పార్టీవారు కోరుతున్నారు.