ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా మారింది. ఇప్పుడు మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకుంది. అయితే, జగన్ సర్కార్ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో, ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంపై ‘స్టేటస్ కో’ కొనసాగుతోంది. అంటే, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. కానీ, దాన్ని ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్ గుర్తించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వమే, రాజధానిని గుర్తించకపోతే.. అమరావతికి అసలు గుర్తింపు వుంటుందని ఎలా అనుకోగలం.?
ముంచుకొస్తున్న ప్రమాదం.!
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, పదేళ్ళపాటు హైద్రాబాద్, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కీ ఉమ్మడి రాజధాని. తెలంగాణలో హైద్రాబాద్ అంతర్భాగం కాబట్టి, తెలంగాణకు హైద్రాబాద్ శాశ్వత రాజధాని. కేవలం, ఆంధ్రప్రదేశ్‌కి హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని మాత్రమే. అయితే, ఆ ఉమ్మడి రాజధానికి సంబంధించి చాలా హక్కుల్ని గత చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కోల్పోయాయి తమంతట తాముగా. తద్వారా రాష్ట్రానికి. హైద్రాబాద్‌పై వున్న హక్కులు చాలావరకు పోయినట్లే భావించాల్సి వుంటుంది. కానీ, 2024 తర్వాత పరిస్థితేంటి.? ఈలోగా, ఆంధ్రప్రదేశ్ సొంత రాజధానిని ఏర్పాటు చేసుకోగలుగుతుందా.? లేదా.? అప్పటిదాకా కూడా ఈ గొడవలు కొనసాగితే, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని వుండకపోవచ్చు. అదే గనుక జరిగితే, అది అత్యంత అవమానకరమైన విషయమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
వైఎస్ జగన్ సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి.?
చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లుగా, లక్ష కోట్లతో అంతర్జాతీయ స్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించాలనే రూల్ లేదు. ఎటూ శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది గనుక, అందుకు తగ్గ ఏర్పాట్లు.. అంటే, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం అయినా ఈపాటికే చేపట్టి వుండాలి. కానీ, అందుకు వైఎస్ జగన్ సర్కార్ సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు. అదే అసలు సమస్య. పోనీ, నిర్మాణ దశలో ఆగిపోయిన కొన్ని నిర్మాణాలనైనా జగన్ ప్రభుత్వం పూర్తి చేసేందుకు ఉపక్రమిస్తే బావుండేది.
మూడు రాజధానుల ముచ్చట తీరేదెప్పుడు.?
హైకోర్టుని కర్నూలుకి తరలించాలంటే, అదో పెద్ద ప్రక్రియ. అంటే, న్యాయ రాజధానిగా కర్నూలు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై కూడా చాలా గందరగోళం నెలకొంది. ఒకవేళ ‘జమిలి ఎన్నికలు’ అంటూ వస్తే, పరిస్థితి మొత్తం తిరగబడిపోతుంది. మరెలా.? వచ్చే ఎన్నికల నాటికి (జమిలి వస్తే), రాష్ట్రానికి రాజధాని వుంటుందా.? లేదా.? ఇలా ఆపుకుంటూ పోతే, 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాల్సిందేనా.? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారో ఏమో.!