విజయశాంతి కుప్పిగంతులు 

vijayashanthi ready to re joining in bjp
“ఊగి ఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుంది” అని సామెత చెప్పినట్లు, బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సినిమా నటి విజయశాంతి ఆ తరువాత “తల్లి తెలంగాణ” పేరుతో ఒక సొంత కుంపటి పెట్టుకుని, ఎవరూ పట్టించుకోకపోవడంతో టీఆరెస్ పార్టీలో చేరి, కేసీఆర్ తొమ్మిదో చెల్లెలు అని కేసీఆర్ తోనే అనిపించుకుని, లోక్ సభకు గెలిచి ఎంపీ అనిపించుకుని, అక్కడ బేరాలు కుదరక, మహాసముద్రం లాంటి  కాంగ్రెస్ పార్టీలోకి లంఘించి, అక్కడ కూడా భవిష్యత్తు శూన్యం అని తోచడంతో “పగలంతా ఎక్కడ ఎగిరినా, రాత్రికి గూటికి చేరే పక్షి” లా మళ్ళీ బీజేపీ కౌగిట్లో ఒదగబోతోందట!  ఖద్దరు మురికిపట్టిందని గ్రహించి కాషాయం స్వీకరించడానికి ముహూర్తం నిశ్చయం అయిపోయిందట.  సుమారు ఇరవై ఏళ్ళక్రితం విజయశాంతి సినిమా ప్రారంభోత్సవానికి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ హైదరాబాద్ వచ్చి అక్షింతలు వేశారంటే బీజేపీ అగ్రనాయకత్వం బీజేపీకి ఎంత విలువ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.  అయితే ఆమె ఆ విలువను నిలుపుకోలేదు. 
vijayashanthi ready to re joining in bjp
vijayashanthi ready to re joining in bjp
 
 
విజయశాంతి సుమారు పదిహేనేళ్లపాటు సినిమారంగంలో ఉజ్వలమైన కెరీర్ ను చవిచూసింది.  డజన్లకొద్దీ సూపర్ డూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.  కర్తవ్యమ్ సినిమా తరువాత ఆమెకు లేడీ అమితాబ్ అనే ముద్దు బిరుదును ప్రసాదించారు అభిమానులు, మీడియా.  ఈ రకమైన విజయాలతో ఆమె ఒక దశలో నాటి మెగాస్టార్ చిరంజీవిని సైతం ఢీకొట్టింది.  నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దశకు వెళ్లారు ఇద్దరూ.  గ్యాంగ్ లీడర్ అద్భుత విజయం  తరువాత ఆ విభేదాలు ముదిరిపోయి మళ్ళీ కలిసి నటించలేదు.   ఏమైనప్పటికీ  ఆమెకు మొదటినుంచి ఆభిజాత్యం చాల ఎక్కువని చెబుతారు.   తనకున్న ఇమేజ్ కు తనకు ఏ పార్టీలో చేరినా అగ్రతాంబూలం దక్కాలని కోరుకోవడం, ఇతర నాయకుల ప్రతిష్టను తక్కువగా అంచనా వెయ్యడం   ఆమె స్వభావం.  తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని ఆమెకు మెదక్ ఎంపీ స్థానాన్ని ఇచ్చినప్పటికీ కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించలేకపోయారు. 
 
కాంగ్రెస్ పార్టీలో ఆమెకు మంచి గౌరవమే దక్కినప్పటికీ, 2018 లో జరిగిన  శాసనసభ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమీ పనిచేయలేదు.    పైగా తెలుగుదేశం నుంచి మరొక ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండటం విజయశాంతికి పెద్ద కంటగింపుగా మారింది.  ఏ నాయకుడి విలువయినా అతనిద్వారా పార్టీకి లభించే ఓట్ల మీదనే ఆధారపడిఉంటుందనే రాజకీయ సత్యం గ్రహించలేకపోయింది విజయశాంతి.  ఓట్లు తీసుకురాలేని నాయకుడు ఒట్టిపోయిన గొడ్డు లాంటివాడని తెలుసుకోలేక తన ప్రాభవాన్ని ఆకాశము ఎత్తున ఊహించుకుంటూ బొక్కబోర్లా పడిపోతున్నది.  తన తాహతు, అర్హతలకు మించిన పదవులు కావాలని ఆశించడమే విజయశాంతిలో పెద్ద లోపం. 
 
తెలంగాణాలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయిందని,  ఆ పార్టీలో ఇక భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చిన విజయశాంతి కన్ను మళ్ళీ బీజేపీ మీద పడింది.  అప్పటినుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాయబారాలు, బేరాలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నది.  బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది.  విజయశాంతి గోడ దూకబోతున్నదని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నాలు చేసింది కానీ, ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోను అధికారంలోకి సమీపభవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ఆశలు లేకపోవడం, తనకు వయసు మీద పడిపోతుండటం, ఉన్న గ్లామర్ కాస్తా గుటుక్కుమంటే ఆ తరువాత ముఖం  చూసే  నాధుడు  ఉండదు  అని ఎరుక కలిగి, మరో నాలుగేళ్ళదాకా తన ఇమేజ్ ఏమిటో రుజువు చేసుకునే అగత్యం లేకపోవడంతో ఇప్పుడే బీజేపీలోకి దూకడం శ్రేయస్కరం అని ఎంచి కాంగ్రెస్ కంచె దాటడానికి విజయశాంతి నిశ్చయించుకున్నట్లుంది!    
 
ఇలపావులూరి మురళీ మోహన రావు  
సీనియర్ రాజకీయ విశ్లేషకులు