Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై శ్రీవారి దర్శనానికి ఇబ్బందులు ఉండవు..!

తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ విపరీతంగానే ఉంటుంది. ఎంత సౌకర్యాలు కల్పించినా కొన్నిసార్లు భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారానికి టీటీడీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆధునిక సాంకేతికతతో భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వసతి-భద్రతలను పెంచేందుకు ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న వైకుంఠం-1లోని ఈ సెంటర్‌ను భక్తుల సేవలోకి ప్రవేశపెట్టనున్నారు.

దేశంలోనే తొలిసారిగా దేవస్థానంలో ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ రూపుదిద్దుకోవడం విశేషం. విదేశీ తెలుగు దాతృత్వంతో ఈ కేంద్రాన్ని అతి ఆధునికంగా తీర్చిదిద్దారు. దీని సహాయంతో తిరుమలలోని ప్రతి మూలలో భక్తుల కదలికలపై నిఘా ఉంటుంది. ఎక్కడ ఎక్కువ రద్దీ ఉందో, క్యూలైన్లలో ఎంతమంది నిలబడి ఉన్నారో, ఎంతసేపు వేచి ఉన్నారో ఏఐ రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తుంది.

అంతేకాదు, భక్తుల ముఖ కవళికలు, కదలికల ద్వారా ఎవరికైనా అసౌకర్యం ఎదురైతే వెంటనే గుర్తించి సహాయ బృందాలను అలర్ట్ చేస్తుంది. దాంతో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వెంటనే పరిష్కరించే అవకాశం లభిస్తుంది. సర్వదర్శన పరిస్థితులు, వసతి సదుపాయాలు, భద్రతా చర్యలు అన్నీ ఈ కేంద్రం ద్వారా ఒకే చోట నుండి మానిటర్ చేయబడతాయి.

టీటీడీ అధికారులు చెబుతున్నట్లుగా, ఈ సెంటర్ ద్వారా ఇక భక్తులకు తిరుమలలోని రద్దీ పెద్ద ఇబ్బంది కానే కాదు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా, వసతి పొందేలా, భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం కావడం ఖాయం. భవిష్యత్తులో దీన్ని మరిన్ని టెక్నాలజీలతో విస్తరించే అవకాశముందని సమాచారం.
తిరుమల యాత్ర ప్రతి భక్తుడికి జీవితంలో ప్రత్యేక అనుభవం. ఇక ఏఐ ఆధారిత పర్యవేక్షణతో ఆ అనుభవం మరింత సాఫీగా, సురక్షితంగా ఉండబోతోంది. దీని ప్రారంభంతో తిరుమలలో భక్తసేవ మరొక కొత్త దశలోకి అడుగుపెడుతోంది.