‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేకమైన రాష్ట్రం..’ అని గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది. టీడీపీ – బీజేపీ దోస్తానా గట్టిగా వున్న రోజులవి. కేంద్రంలో, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ అధికారాన్ని పంచుకున్న సమయంలో ఎన్నెన్ని మాటలు చెప్పారు.? మాటలు తప్ప, చేతలు కనిపించలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, ప్యాకేజీ కూడా దక్కలేదు. అయినా, ఇప్పటికీ బీజేపీ ‘మాకు ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా చిత్తశుద్ధి వుంది’ అనే చెబుతోంది.
కేంద్రం అంత గొప్పగా సహకరించేస్తోందట..
పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. వీరిలో ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా వున్నారు. అంతలా కేంద్రం సహకరిస్తోంటే, పోలవరం ప్రాజెక్టుకి నిధుల కొరత ఎందుకు వస్తున్నట్లు.? ఈ ప్రశ్నకు వైసీపీ వద్ద సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ కేంద్రాన్ని నిందించడంలేదు గనుక, బీజేపీ నేతలకి వైసీపీని గట్టిగా విమర్శించాల్సిన అవసరమూ రావట్లేదు.
అప్పుడూ, ఇప్పుడూ అదే రాజకీయం..
అప్పట్లో టీడీపీ కూడా ఇలాగే బీజేపీని వెనకేసుకొచ్చింది.. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోంది. టీడీపీకి బీజేపీతో స్నేహమే శాపమైంది. వైసీపీకి కూడా అదే శాపం కాబోతోంది. అంతిమంగా నష్టపోతున్నది రాష్ట్రం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కూడా. టీడీపీ పనైపోయింది.. వైసీపీ పరిస్థితి కూడా ముందు ముందు అలానే తయారయ్యేలా వుంది. ‘ఇక్కడున్నది చంద్రబాబు కాదు, వైఎస్ జగన్..’ అని వైసీపీ నేతలు చెప్పొచ్చుగాక, బీజేపీ రాజకీయాల ముందు వైసీపీ నిలబడటం కష్టమే.
తిరుపతి ఉప ఎన్నికతో లెక్కలు తేలిపోతాయ్
తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి, ఆంధ్రప్రదేశ్‌లో అసలు సిసలు రాజకీయం మొదలు పెట్టాలని బీజేపీ చూస్తోంది. అదే జరిగితే మాత్రం వైసీపీకి గడ్డు కాలమే. తిరుపతి ఉప ఎన్నిక ఖచ్చితంగా బీజేపీ – వైసీపీ మధ్యనే అన్నట్లుగా జరిగే అవకాశముంది. అప్పుడు ఈ రెండు పార్టీల అసలు రంగు బయటపడిపోనుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.