ఎన్నాళ్ల కెన్నాళ్ల కెణ్నాళ్లకు
ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు
గొరవంక పిలిచింది తిరనాళ్లకు
నెలవంక పొడిచింది కొన్నాళ్లకు…
అంటూ “అడవిరాముడు” సినిమాలోని పాట పాడుకుంటున్నారు టి.కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రస్తుతం వారి ఆనందానికి అవధులు లేవు. “ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవూతుంటే… ” అంటూ మరో సాంగ్ ని హం చేస్తున్నారు. ఇంతకూ వారి ఆనందానికి కారణం ఏమిటి? పాటలు పాడుకునేటంత హ్యాపీగా ఎందుకున్నారన్నది ఇప్పుడు చూద్దాం!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికారపార్టీపై వ్యతిరేకత ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటికే రెండుసార్లు పరిపాలించడంతో సహజంగానే కాస్త వ్యతిరేకత ఉండటం సహజం. వాటికి తోడు కవిత లిక్కర్ స్కాం, టీఎస్పీఈస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం, కాళేశ్వరం కుంభకోణం అంటూ ప్రతిపక్షాల విమర్శలు…. వెరసి ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉంది!
ఈ పరిస్థితుల్లో ఆ వ్యాక్యూం ని క్యాష్ చేసుకునే శక్తి సామర్ధ్యాలు, గ్రౌండ్ లెవెల్ కేడర్, బలమైన నాయకులు ఉండటంతోపాటు… “తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే” అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. మరి అలాంటి పార్టీకి ఒక ఇంటర్నల్ సమస్య ఉంది. ఏమిటంటే… సీనియర్ల మధ్య గొడవలు.. ఈగోలు.. పనిమీద కంటే పెత్తనం మీదే ద్యాసెక్కువ అనే విమర్శలు. అన్నింటికంటే ముఖ్యం… పరిపూర్ణమైన ఐకమత్య కొరవడి! ఏ నలుగురూ ఒకచోట కలవరని.. ఒకరు తూర్పంటే.. ఇంకొకరు పడమర అంటారాని!
అయితే తాజాగా ఆ దిక్కులన్నీ ఒకవైపే నడిచాయి.. ఆ భిన్న స్వరాలన్నీ ఒకే పాటందుకున్నాయి.. ఒకే వేదికపై కలిసి కార్యకర్తలను అలరించాయి. అవును… రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీభవన్ లో ఒక రోజు దీక్షకు దిగాయి. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు వంటి అనవసర ఆలోచనలు లేకుండా.. పనికిరాని పంతాలకు పోకుండా.. ఎలాంటి తేడా లేకుండా పార్టీ నేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ థాక్రే సహా రాష్ట్ర నాయకులందరూ భిన్నాభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టి హాజరయ్యారు.
ప్రస్తుతం ఆ గ్రూప్ ఫోటో చూసుకుని మురిసిపోతున్నారు టి.కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంతకు మించిన ఆనందం తమకు లేదని.. ఈ ఐకమత్యం ఎన్నికలు ముగిసేవరకైనా కంటిన్యూ చేయమని కోరుకుంటున్నారు. ఇలాంటి గ్రూప్ మాదిరిగానే నాలుగైదు భారీ బహిరంగ సభలు పెట్టండి.. ఏకతాటిపైకి రండి.. కుర్చీ దక్కించుకొండి అని ఆఫర్స్ ఇస్తున్నారు కార్యకర్తలు. మరి కార్యకర్తల అభిప్రాయాలను కాంగ్రెస్ నేతలు గౌరవిస్తారా..? లేక, ఎప్పటిలాగానే “మీకు మీరే.. మాకు మేమే” అంటారా అన్నది వేచి చూడాలి!