భారత అటార్నీ జనరల్ ఏమి చెప్పారు? మన తెలుగు పచ్చపత్రికలు వాటికి ఎలాంటి భాష్యాలను సమర్పిస్తున్నాయి అనే అంశాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే దీని వెనుక ఎలాంటి కుట్రకోణం, కడుపుమంట దాగున్నాయో సులభంగానే అర్ధం అవుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొందరు హైకోర్టు న్యాయమూర్తులమీద, ఒక సీనియర్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి మీద నిర్దుష్టమైన ఆరోపణలు చేస్తూ ఒక లేఖను వ్రాసారు. ఆ లేఖ కాన్ఫిడెన్షియల్ అని అటు లేఖను ఇచ్చినవారు కానీ, లేఖను తీసుకున్నవారు కానీ ఎక్కడా చెప్పలేదు. అయిదు రోజుల తరువాత ఆ లేఖలోని విషయాలను ప్రభుత్వం సలహాదారు అజేయ్ కల్లమ్ పాత్రికేయ సమావేశంలో బహిర్గత పరచారు. అంతే! అలా బయట పెట్టడం అనేది కోర్టు ధిక్కరణ అవుతుందని, కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ధిక్కరణ కేసులు పెట్టాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన బానిసలుగా వ్యవహరిస్తున్న కొన్ని భజన పత్రికలు చానెళ్లు అమావాస్య అర్ధరాత్రి వేళ అడవుల్లో తోడేళ్ళమాదిరిగా అరవడం మొదలు పెట్టాయి.
డ్రామాలు ఆడటం జగన్ కు చేతకాదు
భారత ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన లేఖ రహస్యం అయితే దాన్ని బయట పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తెలివితక్కువ వాడా? ఆయన న్యాయవాది కాకపోవచ్చు. న్యాయశాస్త్రం చదివినవాడు కాకపోవచ్చు. కానీ, ఎలాంటి న్యాయసలహాలు తీసుకోకుండానే, దాని అనంతర పరిణామాలు అంచనా వెయ్యకుండానే విషయాన్ని బహిర్గతం చేస్తాడా? గత ఎనిమిదేళ్లుగా జగన్ మనస్తత్వాన్ని గూర్చి బాగా తెలిసిన వారెవరైనా జగన్ పోకడ ఎప్పుడూ ముక్కుసూటిగా ఉంటుందని, కుళ్ళు, కుతంత్రాలకు ఆయన నిఘంటువులో చోటు ఉండదని చెప్పగలరు. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ లేఖను బయటపెట్టాడంటే జైలుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో పెట్టాడనుకుని భ్రమ పడుతున్నారా? సింపతీకోసం పాకులాడాల్సిన అగత్యం జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం లేదు. కారు కింద బాంబులు పెట్టించుకుని ఒకరోజు దక్షిణ హస్తానికి, ఒకరోజు వామహస్తానికి బ్యాండేజ్ వేసుకుని దీనంగా ముఖం పెట్టి సానుభూతికోసం ప్రాధేయపడాల్సిన అవసరం జగన్మోహన్రెడ్డికి ఎందుకుంటుంది? నిన్నగాక మొన్నే ఆయన అనితరసాధ్యమైన విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రత్యర్థి చంద్రబాబును నామరూపాలు లేకుండా చేశాడు. ఈ ఏడాదిన్నరలోనే ఆయన ప్రతిష్ట మసకబారుతున్న సూచనలు ఏమీ లేవు. అందువలన డ్రామాలు ఆడాల్సిన అవసరం జగన్ కు లేదు. ఆ మనస్తత్వమూ ఆయనది కాదు.
అశ్వని కుమార్ లేఖ వెనుక కుట్ర
ఇక జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ కోర్ట్ ధిక్కరణ కిందికి వస్తుందా అని అటార్నీ జనరల్ కు లేఖ రాసింది బీజేపీ నాయకుడు అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ. బీజేపీకి, వైసిపికి మధ్య రాజకీయ శత్రుత్వం ఏమీ లేదు. ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారు. అలాంటి సమయంలో అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కు లేఖ రాయడం వెనుక తెలుగువారైన ఒక ప్రముఖ న్యాయకోవిదుడు ఉండవచ్చు అని కొందరు తటస్తులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఆ న్యాయకోవిదుడు ఎవరి తరపున పనిచేస్తారో కూడా దేశం మొత్తానికి తెలుసు. జగన్ ఆ లేఖను బయట పెట్టడం కోర్ట్ ధిక్కారం అవుతుందో కాదో తేల్చుకోవాల్సిన అగత్యం అశ్వనీకుమార్ కు ఎంతమాత్రం లేదు. ఆయనతో కావాలనే ఆ న్యాయకోవిదుడు అలాంటి లేఖను అటార్నీ జనరల్ కు వ్రాయించారని అనేకమంది సందేహిస్తున్నారు. అలాగే ఏ విధంగా అయినా ఆంధ్రప్రదేశ్ లో పాదం మోపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనేతలు కొందరు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
న్యాయసలహా చేట భారతంలా ఉంటుందా?
ఇక సాధారణంగా మనం ఏదైనా అంశం మీద పెద్ద పెద్ద లాయర్లను న్యాయసలహాను కోరినపుడు మన సందేహం సబబా కాదా అనే విషయాన్ని ఒకే ఒక ముక్కలో జవాబు రూపంలో ఇస్తారు. అంతే తప్ప చరిత్ర మొత్తాన్ని ప్రస్తావించారు. తద్భిన్నంగా అటార్నీ జనరల్ ఇచ్చిన జవాబులో జగన్ మీద ముప్ఫయి ఒక్క కేసులు ఉన్నాయని, రాజకీయ నాయకుల అవినీతిపై విచారణ వేగవంతం చెయ్యాలని జస్టిస్ రమణ ఆదేశాలు జారీ చేసిన తరువాత జగన్ అలాంటి లేఖను ఇవ్వడం, దాని వివరాలు బయట పెట్టడం మొదలైన అనేక అంశాలను జవాబులో ప్రస్తావించడం చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ముక్తాయింపుగా అటార్నీ జనరల్ ఏమి చెప్పారు? “”విషయం సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఉంది కాబట్టి నేను జగన్ మీద కోర్ట్ ధిక్కరణ నేరం మోపాలని సలహా ఇవ్వను, నేను జోక్యం చేసుకోవడం సరికాదు” అని సుస్పష్టంగా చివరి వాక్యంగా చెప్పారు. ఇక్కడ ముఖ్యమైనదేమిటంటే వందల పేజీల తీర్పు కన్నా, చిట్టచివర రాసే ముగింపు వ్యాక్యం ప్రధానం. అటార్నీ జనరల్ చివరగా చెప్పిన వాక్యమే ప్రధానం తప్ప ఆయన లేఖలో ప్రస్తావించిన విషయాలు కావు.
వక్రభాష్యాలతో విషం కక్కుతున్న పచ్చ మీడియా
అసలు విషయాన్ని మన తెలుగు కులపత్రికలు వదిలేసి జగన్ ది కోర్ట్ ధిక్కరణే అని అటార్నీ జనరల్ చెప్పారని పతాక శీర్షికలు ప్రచురించడం ప్రజాస్వామ్య విలువలను, న్యాయవిలువలను మంట కలపడం తప్ప మరొకటి కాదు. ఈ వార్తను జాతీయ పత్రికలు సరైన కోణంలో ప్రచురించగా, మన క్షుద్ర తెలుగు పత్రికలు మాత్రం జగన్ మీద విషం కక్కి, చంద్రబాబు మెప్పు కోసం తమవంతు ప్రయత్నాలు చేసి ఛీ అనిపించుకున్నాయి. మనది అమ్ముడుపోయే జర్నలిజం అని మరోసారి రుజువు చేసుకున్నాయి.
బీజేపీ కపటనాటకాలు సాగకపోవచ్చు
జగన్ మీద వీలైనన్ని కేసులు బనాయించి జగన్ ను అదుపులో పెట్టి తమ మాటను చెల్లించుకునే కుటిల వ్యూహాలు ఉన్నాయని తలపండిన పాత్రికేయులు మనలో మాటగా ప్రస్తావిస్తున్నారు. “””అయితే అంతిమంగా వారు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అపకారము తలపెట్టరు. ఎందుకంటే ఆంధ్రాలో నాలుగు సీట్లు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సాయం బీజేపీకి అవసరం. చంద్రబాబును ఇక వారు నమ్మే పరిస్థితి లేదు. కుట్ర చేసి జగన్ ను జైలుకు పంపితే బీజేపీకే తీవ్ర నష్టం చేకూరుస్తుంది. కాబట్టి వారు ఈ విధంగా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం” అనే సూత్రాన్ని ప్రయోగించి జగన్ ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు” అంటూ విశ్లేషించారు. కానీ బీజేపీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే తాము చెలగాటలు ఆడుతున్నది పిల్లితో కాదని, పులితో అని!
న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించవద్దు
జగన్ లేఖ భవితవ్యం భారత ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ఉంది. ఈ విషయంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నిర్ణయం తీసుకోనివ్వండి. “జగన్ మీద కోర్ట్ ధిక్కరణ నేరం మోపాల్సిందే” అని ఆయన నిర్ణయిస్తే శిరసావహిద్దాం. ఎలాంటి తదుపరి న్యాయపోరాటం చెయ్యాలో జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు. న్యాయవ్యవస్థ పట్ల జగన్ తన గౌరవాన్ని అనేకమార్లు ప్రకటించారు. మొన్నటి లేఖలో కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్గాటించారు. న్యాయవ్యవస్థను గౌరవిద్దాం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు