తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. ఈ ఏడాది కొత్తగా రూపొందించిన పాఠ్యాంశాల్లో సాంఘిక శాస్త్రంలోని 268వ పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలు పొందుపరిచారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ చేశారు. పుస్తకంలోని ఆ పుటను కూడా పోస్ట్ చేశారు.
కళకి, కళాకారులకు విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా చేసిన మహానాయకుడు, ఎన్నో ఏళ్ల సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకు వచ్చిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని, మద్రాసీయులమనే పేరును చెరిపి దేశంలో తెలుగువాడికి, తెలుగువేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దుబిడ్డ మా నాన్నగారు అని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ఇచ్చేలా ఆయన గురించి పదో తరగతి సోషల్‌లో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
అభిమానం.. పాఠ్యాంశంగా..
ఈ పాఠ్యాంశంలో రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం, పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు, ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు వంటి అంశాలను సృష్టించారు. కేసీఆర్ రాజకీయ ప్రయాణంలో ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీతో ఉంది. ఎన్టీఆర్ పైన అభిమానం సహజం. తన కొడుకు(కేటీఆర్)కు కూడా ఆయన పేరునే పెట్టుకోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఓ విధంగా కేసీఆర్‌కు ఆయనపై ఉన్న అభిమానం ఎన్టీఆర్ పాఠ్యాంశం పదో తరగతి సాంఘిక శాస్త్రంలోకి ఎక్కేలా చేసిందని చెప్పవచ్చునని అంటున్నారు.
చంద్రబాబుతో కయ్యం.. జగన్‌పై రివర్స్
2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లు రెండు ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఓటుకు నోటు తర్వాత రెండు ప్రభుత్వాల మధ్య, అలాగే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. ఏకంగా నాటి చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ నుండి అనూహ్యంగా అమరావతికి షిఫ్ట్ అయ్యే పరిస్థితి. ప్రాజెక్టులు, హైదరాబాద్‌లో సెక్షన్ 8, పంపకాలు ఇలా అన్నింటా కేంద్రానికి ఫిర్యాదు చేసేస్థాయికి వెళ్లింది.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ మొదలు ఏకంగా జైలుకు పంపిస్తామని ఇరుపార్టీల నేతలు పరస్పరం ఘాటుగా విమర్శించుకునే స్థాయికి చేరుకుంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పుడ జగన్‌తో కేసీఆర్‌కు మంచి సంబంధాలు కనిపించాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉన్నారు. 2018లో మళ్లీ తెరాస గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. ఆ తర్వాత ఈ రెండు పార్టీలు, ప్రభుత్వాల మధ్య కూడా మంచి సంబంధాలే కనిపించాయి. కానీ ఇటీవల నీటి ప్రాజెక్టుల గొడవలు ప్రారంభమయ్యాయి. మళ్లీ కేంద్రానికి ఫిర్యాదు చేసే స్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని చేర్చడంలో రాజకీయం లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో గతానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అప్పుడు చంద్రబాబుతో సై అంటే సై అనేలా ఉంది. ఇప్పుడు రివర్స్ అయింది.
రెండువైపులా అభిమానం చూరగొంటున్న కేసీఆర్
తెలంగాణలో గతంలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2009 తర్వాత తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనపడింది. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం నుండి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు తెరాసలో ఉన్న మెజార్టీ నేతలు అంతా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారే. కేసీఆర్ నుండి మొదలు పెడితే ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి కీలక నేతలు అంతా తెలుగుదేశం పార్టీ వారే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బలం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్‌ను అభిమానించే వారు తెలుగుదేశం సానుభూతిపరులు చాలామంది ఉన్నారు.
తెలంగాణలోని ఎన్టీఆర్ , తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల అభిమానాన్ని చూరగొంటున్నారు కేసీఆర్. అదే సమయంలో బాలకృష్ణ సహా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసిస్తున్నారు. అంటే రెండువైపులా ఆయనకు మెచ్చుకోలు లభిస్తోంది. నిన్నటి వరకు విమర్శలు గుప్పించిన ఏపిలోని అధికార తెలుగుదేశం.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అదే కేసీఆర్‌ను మెచ్చుకునే పరిస్థితులు తీసుకువచ్చారు.