వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరదల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు, పంటలు నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నష్టానికి సంబంధించిన పూర్తి నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఫోన్‌లో చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.
మెదక్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన వరద సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. కేంద్రం నుంచి అత్యవసరంగా నిధులు కోరేలా ఒక నివేదిక తయారు చేయాలని జిల్లా అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వరదలు తగ్గిన వెంటనే పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక తయారు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు: వరదల్లో నష్టపోయిన వారికి పూర్తి సహాయం అందించాలి, కేంద్రం నుంచి నిధులు కోరేందుకు నివేదిక సిద్ధం చేయాలి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించి, విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, వర్షాలు, వరదల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కూడా వరదలపై సమీక్షించారు. కామారెడ్డిలో జరిగినది ప్రకృతి విపత్తని, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేసి అందరినీ ఆదుకుంటామని తెలిపారు. నష్టానికి సంబంధించిన నివేదికను సీఎంకు అందజేస్తామని, కేంద్రం కూడా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఆమె చెప్పారు.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించింది. కామారెడ్డిలోనూ పర్యటించాల్సి ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దు అయ్యింది.


