Supreme Court: గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు ప్రశ్నలు.. తేడా వస్తే అధికారులైనా జైలుకే..

హైదరాబాద్ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై అనేక రకాల వివాదాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేకపోతే ఎందుకు చర్యలు ప్రారంభించారని?” అంటూ ధర్మాసనం నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

లాంగ్ వికెండ్‌ సందర్భాన్ని చూస్తూ ఈ పనులు ఎందుకు చేపట్టారనే అంశంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూముల తవ్వకాలు, నిర్మాణాలు పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమైతే సీరియస్ చర్యలు తప్పవని, నష్టపరిహార చర్యలు తీసుకోకపోతే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. కోర్టు వ్యాఖ్యలతో అధికారులు ఒకింత నిర్ఘాంతపోయారు.

ఇక కేంద్రానికి చెందిన సాధికారిక సంస్థ నివేదికపై సమాధానం దాఖలు చేసేందుకు రాష్ట్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై పెట్టిన కేసులను కూడా న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వీటిని ఈ కేసుతో కలిపి పరిశీలించడం కుదరదని, వేరే పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ సూచించారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు గచ్చిబౌలి భూముల వివాదంపై మరింత దృష్టిని మరల్చాయి. పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామిక హక్కులపై మరోసారి చర్చ తెరపైకి వచ్చిన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార యంత్రాంగం ధర్మాసన వ్యాఖ్యలతో అప్రమత్తమవుతుందా లేక మరోసారి తడబడుతుందా అన్నది చూడాల్సిందే.