Venkaiah Naidu: ఉచిత పథకాలు, ఆర్థిక వ్యవస్థపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళన

ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఇటువంటి పథకాలతో రాష్ట్రాలు అప్పుల ఊబిలోకి నెట్టబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

“‘చేపలు పట్టడం నేర్పించాలి కానీ.. చేపలు తీసుకొచ్చి ఉచితంగా ఇవ్వకూడదు’ ” అంటూ ఉచిత పథకాల అమలు పట్ల తన వైఖరిని స్పష్టం చేశారు. ఉచితాలు పరిమితులు దాటి అనుచితంగా తయారయ్యాయని, కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని అమలు చేయడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు.

ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రమాదంలో పడుతోందని, ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేయాల్సి వస్తోందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రయోజనం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాలు విద్య, వైద్యంపై దృష్టి సారించాలని, ఉచితాలు అలవాటు చేయకూడదని వెంకయ్యనాయుడు సూచించారు. విద్య వల్ల పేదవాడు కూడా సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయని, వైద్యం ప్రతి మనిషికి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలియజేయాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తున్నారో, అందులో ఎంత తిరిగి చెల్లిస్తున్నారో ప్రకటించాలని కోరారు. ఉచితాలు, అప్పులు పరిధులు దాటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చేటప్పుడు, వాటిని ఎలా తీరుస్తారో అసెంబ్లీలో చర్చించాలని, ఇది ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచుతుందని ఆయన సూచించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు, చట్టబద్ధతకు సంబంధించి వెంకయ్య నాయుడు మరిన్ని సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినప్పుడు, వారు ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్య నాయుడు అన్నారు. 10వ షెడ్యూల్‌ను (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) సవరించాలని సూచించారు.

చట్టసభల్లో కుటుంబ సభ్యులపై దూషణలు సరికాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణను రెండేళ్లలోపు పూర్తి చేయాలని, అందుకు తగినట్లుగా ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యను పెంచి, న్యాయమూర్తులను నియమించాలని ఆయన సూచించారు. అర్హత ఉన్నవారికే రాజకీయాల్లో అవకాశం దక్కాలని, రాజకీయ వారసత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి ప్రయత్నించడాన్ని వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి యత్నం మొత్తం సమాజానికి, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశమని, మరోసారి ఇలాంటివి జరగకుండా దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Janasena Chintala Lakshmi Reaction On Fake Liquor Sales In AP | Telugu Rajyam