పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయమై దాదాపు అధికారిక ప్రకటన లాంటిది బయటకు వచ్చేసినట్లే. ఎందుకంటే, వైసీపీ సొంత మీడియాలోనే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై క్లారిటీ ఇచ్చేశారు. 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టుని డిజైన్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారు. అయితే, ఈ తగ్గింపుకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కేంద్రం, తగినన్ని నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేనందున, దాదాపుగా పూర్తిస్థాయి ప్రాజెక్టుతో వచ్చే ప్రయోజనాల్ని రాబట్టేలా, తక్కువ ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు పనుల్ని సరిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందట.
ఎత్తు తగ్గితే నష్టమేంటి.?
ఏ ప్రాజెక్టు అయినా ఎత్తు కీలకం. ఆల్మట్టి డ్యాం విషయమై ఇప్పటికీ వివాదాలున్నాయి. కింది రాష్ట్రాల అభ్యంతరాల్ని పక్కన పెట్టి, కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తుని పెంచేయడానికి ఏనాడో నిర్ణయం తీసేసుకుంది. తద్వారా దిగువ రాష్ట్రాలు ఎడారిగా మారుతాయి. పోలవరం ప్రాజెక్టు కథ వేరు. పోలవరం ప్రాజెక్టు కింద కాటన్ బ్యారేజీ వుంటుంది. దానికి నీటి నిల్వ సామర్థ్యం చాలా చాలా చాలా తక్కువ. కేవలం మళ్ళింపులలకే ఆ బ్యారేజీ పరిమితం. అలాంటప్పుడు, సముద్రంలోకి వృధాగా పోయే నీటిలో మేగ్జిమం నీటిని వినియోగించుకోవాలి.. అది పోలవరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతోనే సాధ్యమవుతుంది.
డబ్బుల్లేకపోతే.. మేమేటి సేత్తాం.!
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అయినా, కేంద్రం.. నిధుల విషయంలో కొర్రీలు పెడుడోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేదు. దాంతో, కేంద్రం ఇచ్చే నిధులకు లోబడి, ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి వుంటుంది. లేకపోతే, ఆ కాస్త ప్రయోజనాలు కూడా ఇప్పట్లో దక్కే అవకాశం వుండదు. ఇదే ఆలోచనతో, వైఎస్ జగన్ ప్రభుత్వం, కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా ముందడుగు వేస్తోందని అనుకోవాలేమో.
నిధుల లేమి మామలేనంటున్న విజయసాయిరెడ్డి
పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారంలో నిజం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే, రాష్ట్రం తరఫున బోల్డంతమంది ఎంపీలను కలిగి వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతోంది.? కేంద్రం ఏం చెప్పినా, వేరే దారి లేదనట్టు ‘తలొగ్గి’ ఎందుకు వ్యవహరిస్తోంది.? అన్నదే అసలు సిసలు చర్చ ఇక్కడ.