ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఇది ఈనాటి మాట కాదు. బ్రిటిష్ హయాం నుంచీ వినిపిస్తున్నదే. అందుకే బ్రిటిష్ హయాంలో ఈ ప్రాజెక్టు ఆలోచన జరిగింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా పోలవరం ప్రాజెక్టు కల ఇంకా సాకారం కాలేదంటే, ఇప్పటిదాకా దేశాన్ని, ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించిన పాలకుల వైఫల్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అంజయ్య హయాంలో శంకుస్థాపన.. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టు పనులు మొదలు.. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకి ఓ రూపం రావడం.. ఇవీ ఇప్పటిదాకా జరిగినవి. అయితే, పోలవరం భవిష్యత్తేంటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
వైఎస్ జగన్ హయాంలో పూర్తవుతుందా.?
‘మా నాన్నగారు మొదలు పెట్టిన ప్రాజెక్టుని నేను పూర్తి చేస్తా..’ అంటున్నారు వైఎస్ జగన్. చేయగలిగితే మాత్రం, అది చారిత్రక ఘట్టమే అవుతుంది. కానీ, పోలవరం ఒకప్పుడు రాష్ట్ర ప్రాజెక్టు.. ఇప్పుడు అది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం నిధులు ఇచ్చి, పర్యవేక్షిస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని నిర్మిస్తుంది. అయితే, ప్రాజెక్టు చుట్టూ చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేసే విషయమై వెనకడుగు వేస్తోంది. దాంతో, ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడింది. 2021 చివరి నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అంటోంది వైఎస్ జగన్ సర్కార్. గతంలో చంద్రబాబు 2018 చివరి నాటికే పూర్తి చేసేస్తామని చెప్పారనుకోండి.. అది వేరే సంగతి.
విగ్రహ రాజకీయాలు మొదలయ్యాయ్..
పోలవరం ప్రాజెక్టు పక్కనే 100 అడుగుల ఎత్తయిన వైఎస్సార్ విగ్రహం పెడతామని అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిధులతో కట్టే ప్రాజెక్టు దగ్గర వైఎస్సార్ విగ్రహేమంటి? అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ‘చంద్రబాబు కష్టానికి నిలువెత్తు నిదర్శనం పోలవరం ప్రాజెక్ట్.. కడితేగిడితే చంద్రబాబు విగ్రహం కట్టాలి..’ అంటోంది టీడీపీ. ఏమో, జగన్ హయాంలో వైఎస్సార్ విగ్రహం పెడితే, ఆ తర్వాత చంద్రబాబు విగ్రహం కూడా పెడతారేమో. మరి, మోడీ.. వైఎస్ జగన్ విగ్రహాల సంగతేంటి.? భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.
రాజకీయం తర్వాత.. ముందైతే ప్రాజెక్టు పూర్తవ్వాలి.!
కేంద్రమే నిధులు ఇస్తుందో.. రాష్ట్రమే ఇంకాస్త కష్టపడుతుందో.. పోలవరం ప్రాజెక్టు అయితే పూర్తయిపోవాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. దాంతో, పోలవరం.. ఆంధ్రప్రదేశ్ ఇజ్జత్ కా సవాల్ అయిపోయింది. సకాలంలో ప్రాజెక్టుని వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేస్తే.. అది చారిత్రక ఘట్టం అయి తీరుతుందన్నది నిర్వివాదాంశం.