తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆరెస్స్ గా సాగుతున్న రాజకీయం రసవత్తరంగా సాగుతున్న దశలో.. మోడీ హైదరాబాద్ పర్యటన, అనంతరం బహిరంగ సభలో చేసిన ప్రసంగం మరింత హీటెక్కించింది. మోడీ ప్రసంగం ఆధ్యంతం కుటుంబ పాలన, అవినీతి చుట్టూనే తిరిగింది. ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, కవితల పేర్లు ప్రస్థావించని మోడీ… ఊహించని రీతిగా అవినీతి కేసుల విషయంలో సంచలన వ్యాఖ్యలే చేశారు.
అవును… తాజాగా తెలంగాణలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన ప్రధాని మోడీ… సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించకుండానే గట్టి హెచ్చరికలు పంపారు. తెలంగాణ.. కుటుంబ పాలనతో అవినీతిలో మగ్గిపోతోందని.. అందరూ వారికి వ్యతిరేకంగా పోరాడాలని.. అవిరామంగా జరుగుతున్న అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలని మోడీ పిలుపునిచ్చారు.
ఇదే క్రమంలో… అవినీతిని ఏమాత్రం సహించేది లేదని ఒకటికి రెండు సార్లు నొక్కి చెప్పిన మోడీ… వారు ఎంత పెద్దవారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఈడీ – సీబీఐ వంటి సంస్థలపై చేస్తున్న విమర్శలపైనా మోడీ పరోక్షంగా స్పందించారు. చట్టపరమైన సంస్థలను అడ్డుకోవద్దని సూచించారు. అదేవిధంగా.. విచారణ సంస్థలను సైతం బెదిరిస్తున్నారంటూ.. పరోక్షంగా కవిత – ఈడీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎంతటి పెద్ద వారినైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్న చెప్పిన మోడీ… కవితను టార్గెట్ చేసినట్టుగా సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మోడీ మాటలు కవిత అరెస్ట్ పైనే చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సమయంలో ప్రజాభిప్రాయం కుడా తీసుకోవాలనుకున్నారో ఏమో కానీ… “అవినీతిపరులపై చర్యలు తీసుకోవద్దా?” అంటూ మోడీ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలనుంచి “తీసుకోవాలి” అంటూ భారీగా స్పందన రావడం కొసమెరుపు!